నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను కుదుపు కుదిపేసిన డ్రగ్స్ కేసును ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వదిలేసిందన్న ప్రచారం సాగింది. ఈ కేసులో పలువురు సినీ సెలబ్రెటీలను విచారించి అనంతరం క్లీన్ చిట్ ఇచ్చింది. నాలుగేళ్లుగా సాగిన ఈ కేసులో సినీ సెలబ్రెటీలు ఎవరూ లేరని తేల్చింది. అయితే వారి విచారణ సందర్భంగా గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకొని పరీక్షించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది.
తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని తాజాగా సినీ సెలబ్రెటీలు రానా దగ్గుబాటి రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, తరుణ్, నందులను ఈడీ ఆదేశించడం సంచలనమైంది.
ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించించేందుకు సమన్లు జారీ చేసింది. ఒక్కొక్కరికి ఒక్కోతేదీని కేటాయించి నోటీసులు ఇచ్చింది.
2017లో నమోదైన డ్రగ్స్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. అయితే సినీ ప్రముఖులందరికీ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. పలువురు డ్రగ్స్ విక్రేతలపై చార్జీషీట్లు దాఖలు చేసి ఈ కేసును దాదాపు క్లోజ్ చేశారు.
అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్రదర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి తాజాగా రంగంలోకి దిగింది.
తాజాగా ఈడీ సీనీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈనెల 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందూ, 22న తరుణ్ హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారించనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ డ్రగ్స్ కేసు లింకులు మరోసారి సంచలనమయ్యాయి.