అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో కాకరేపిన తెలుగు సినిమా పరిశ్రమ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీని తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ‘మా’ క్రమశిక్షణ సంఘం తెలిపింది. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్ సభ్యులు ప్రచారానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహరావు, హేమలు బరిలో ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేకఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
ప్రధానంగా ఈసారి మా ఏజెండాగా నూతన సొంత భవనం ఉంది.దాంతోపాటు నటీనటుల సమస్యలు పరిష్కరించాలనేది మరో డిమాండ్. ఇప్పటికే తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేస్తే ‘మా’కు సొంత స్థలం కొంటానని.. భవనం కట్టిస్తానని హీరో మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఇక పాత అధ్యక్షుడు నరేశ్, నటి హేమ మధ్య దీనివిషయమై మాటల యుద్ధం నడిచింది. ఇక నటీనటులు అంతా చీలిపోయి ‘మా’ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హోరెత్తించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకొని క్రమశిక్షణ సంఘం చైర్మన్, సీనియర్ నటుడు కృష్ణంరాజుకు లేఖ రాశాడు. నటీనటులు మా ఎన్నికలు జాప్యం చేయడంతో నోరు పారేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.