Tollywood Drugs Case: నాలుగేళ్ల కింద సంచలనం రేకెత్తించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అనుమానితులుగా ఉన్నవారందరినీ విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అందరికీ నోటీసులు జారీచేసిన ఈడీ.. ఇవాళ్టి నుంచి విచారణ షురూ చేయనుంది. ముందుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. దీంతో.. ఏం జరగబోతోంది? అధికారులు ఏం అడుగుతారు.. పూరీ ఏం చెబుతారు? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
గతంలో డ్రగ్స్ కేసును పర్యవేక్షించిన అధికారుల నుంచి సమాచారం తీసుకున్న ఈడీ.. వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలను విచారించేందుకు సిద్ధమైంది. వీరిలో సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు ఉన్నారు.
వీరిలో.. పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత.. సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందూ, 22న తరుణ్ హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో వీరిని విచారించనున్నారు.
అయితే.. వీరంతా డ్రగ్స్ వినియోగించారా? లేదా? అనే విషయమై ఈడీ విచారించట్లేదు. ఈ డ్రగ్స్ కొనుగోలు కోసం డబ్బులను ఎలా తరలించారు? ఎలాంటి అక్రమ పద్ధతుల్లో డబ్బును వెచ్చించారు? అనేది తెలుసుకోవడానికే ఈడీ విచారణ చేపడుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
గతంలో రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా వీరందరినీ విచారించే అవకాశం ఉంది. అయితే.. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి, ఇప్పుడు ఈడీ విచారణలో ఏం జరుగుతుందనే టెన్షన్ సెలబ్రిటీల్లో నెలకొంది. దాదాపుగా 20 రోజులపాటు సాగనున్న ఎంక్వైరీలో ఏం తేలుతుంది? సినీ సెలబ్రిటీలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అన్నది చూడాలి.