Tiger Nageswara Rao: భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ టైటిల్ రోల్ చేశారు. దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువై సినిమా దెబ్బతింది. దాదాపు మూడు గంటల సినిమాను ఓ అరగంట తగ్గించి మరో వెర్షన్ వదిలారు. అయినా ఫలితం పెద్దగా మారలేదు.
అందులోనూ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి భగవంత్ కేసరి, లియో చిత్రాల నుండి గట్టి పోటీ ఎదురైంది. దాదాపు రూ. 35 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్ తో బరిలో దిగిన టైగర్ నాగేశ్వరరావు రూ. 20 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. కాగా టైగర్ నాగేశ్వరరావు నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 17 నుండి టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న నేపథ్యంలో అక్కడ చందాదారులు ఫ్రీగా చూసేయవచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో విడుదల చేశారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రం స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కింది. మెరుపు వేగంతో టైగర్ నాగేశ్వరరావు చెప్పి మరీ దొంగతనాలు చేసేవాడు. కొని రాష్ట్రాల పోలీసులను వణికించాడు. పెద్దలను దోచి పేదలకు పెట్టే గుణం వలన జనాల్లో అతనికి మంచి పేరు ఉండేదట.
ఇండియన్ రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావును చెప్పుకోవచ్చు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. రెండు దశాబ్దాల అనంతరం రేణూ దేశాయ్ ఓ కీలక పాత్రలో రీఎంట్రీ ఇచ్చింది. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా ఇతర కీలక రోల్స్ చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.