Superstar Krishna: కృష్ణ హీరోగా విజయనిర్మల హీరోయిన్ గా 1974లో వచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాదు.. అప్పట్లో ప్రభంజనం సృష్టించింది కూడా. గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా విజయం కృష్ణ కెరీర్ పై ప్రభావం చూపించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు మరో సినిమా ఆ రేంజ్ లో విజయాన్ని అందించలేకపోయింది. అయితే అల్లూరిపై సినిమా తీయాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నించినా కూడా ఆ అదృష్టం కృష్ణను మాత్రమే వరించింది.
ఎన్టీఆర్ శోభన్ బాబు స్క్రిప్ట్ వరకు కూడా చేయించుకున్నారు. కానీ పూర్తి చేయలేకపోయారు. కానీ ఆదిశేషగిరిరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దర్శకుల విషయంలో మొట్టమెదట రామచంద్రరావును అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆయన చనిపోయారు. దీంతో ఈ సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించారు. అయితే రామచంద్రరావు మరణంతో కృష్ణ దర్శకుడిగా కూడా మారితే.. యాక్షన్, పోరాట సన్నివేశాల కోసం ఈయన ఆప్తమిత్రుడు, దర్శకుడు కె ఎస్ దాస్ ని సంప్రదించారట.
సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా కౌబాయ్ సినిమా తీసి కృష్ణకు తిరుగులేని విజయాన్ని అందించిన దాస్ పూర్తి పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. ఇలా చాలా రోజులపాటు షూటింగ్ జరుగుతూ మధ్య మధ్యలో ఆగుతూ ముగ్గురు దర్శకుల చేతుల మీదగా సినిమా పూర్తైంది. తెలుగులో మొట్టమొదటిసారిగా కలర్ స్కోప్ వాడిన సినిమాగా కూడా అల్లూరి సీతారామరాజు రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమా చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు పాత్రకు కృష్ణ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని ఒప్పుకున్నారు. అయితే బాలీవుడ్ లో పాకీజా సినిమా కోసం వాడిన కెమెరాస్కోప్ పరికరాలను ఈ సినిమా కోసం కూడా తెప్పించి వాడడంతో తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచిపోయింది.