Box Office: చిత్ర పరిశ్రమ మనుగడ చిన్న చిత్రాల విజయం పైనే ఆధారపడి ఉంటుందని కొందరు టాలీవుడ్ పెద్దల మాట. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాల మార్జిన్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రూ. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఒక స్టార్ హీరో సినిమా… రూ. 160-170 కోట్ల వసూళ్లు సాధించినా మిగిలేది ఏమీ ఉండదు. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలు కూడా కష్టమే. అదే సమయంలో రూ. 10-15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిన్న సినిమా 30-40 కోట్లు వసూళ్లు రాబట్టినా భారీ లాభాలు దక్కుతాయి. అందుకే ఒక్క లోబడ్జెట్ మూవీ హిట్ కొడితే లాభపడేది ఎందరో.

అయితే అలాంటి చిన్న సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. కొన్ని సినిమాల్లో విషయం ఉన్నా.. ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్స్ నుండి వెళ్లిపోతాయి. ఇక 2021లో రెండు లోబడ్జెట్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని, భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు సాధించిన ఈ రెండు చిత్రాలు చాలా మంది దర్శక నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఉప్పెన, జాతిరత్నాలు చిత్రాలు రెండూ సీమ టపాకాయ్ లా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆటం బాంబులా పేలాయి.
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రంతోనే హిస్టరీ క్రియేట్ చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేశాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ‘ఉప్పెన’ వసూళ్ల సునామీ సృష్టించింది. హీరోయిన్ కృతి శెట్టి గ్లామర్, దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు విజయ్ సేతుపతి విలనిజం మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన రూ. 83 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించింది. ఉప్పెన బడ్జెట్ రూ. 20కోట్లకు లోపే.
Also Read: Jabardasth: జబర్దస్త్ కు షాక్ ఇచ్చిన ఇద్దరు టీమ్ లీడర్లు… ఇటు నుంచి అటు జంప్
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన మరో స్మాల్ బడ్జెట్ మూవీ జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఊహించని వసూళ్లు రాబట్టింది. డెబ్యూ డైరెక్టర్ అనుదీప్ తన టేకింగ్, డైలాగ్స్ తో నవ్వులు పూయించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు మూవీ రూ. 70 కోట్లు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు అందుకుంది. జాతి రత్నాలు మూవీ నిర్మాత నాగ అశ్విన్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. జాతి రత్నాలు విజయం కోవిడ్ సంక్షోభం తర్వాత పరిశ్రమకు ఉపశమనం కలిగించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Also Read: Naga Chaitanya: ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్గా నాగ్ చైతన్య