Kantara: కన్నడ సినిమా ‘కాంతార’కు ఎదురుదెబ్బ తగిలింది. పాన్ ఇండియా లెవల్లో విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ మూవీలోని ‘వరహరూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళ కోర్టు తీర్పునిచ్చింది. ఈ పాటను కేరళలోని ఓ అల్బమ్ నుంచి కాపీ కొట్టారని ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సెషన్స్ కోర్టు విచారణ చేసి సంచలన తీర్పునిచ్చింది. సినిమా థియేటర్లో గానీ, యూట్యూబ్ లో గానీ వరహ రూపం పాటను ప్రదర్శించరాదని పేర్కొంది. అయితే సినిమాకు ఈ పాటే హైలెట్ గా నిలిచింది. భూతకోల ఆడే వ్యక్తిలో పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో ఈ పాట వస్తుంది. ఇందులో రిషబ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు దక్కాయి.

ఇండియా బాక్సాపీస్ ను షేక్ చేస్తున్న సినిమా ‘కాంతార’. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీలోనూ రిలీజ్ చేశారు. కన్నడంలో ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసిన ‘కాంతార’ మిగతా ఇండస్ట్రీల్లోనూ ఆల్ టైం రికార్డులు సృష్టిస్తోంది. అటు బాలీవుడ్లోనూ ఓ ప్రాంతీయ సినిమా ఇంతటి ఘన విజయంసాధించడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు సినిమా స్టోరీనే ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు. మారుమూల గ్రామంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతీ సీన్ చెప్పుకోదగినదే.
ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రకృతికి, మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ దీనిని చిత్రీకరించారు. ఇందులో భూతకోల ఆడే వ్యక్తిలో పంజుర్లి దేవత ఆవహిస్తుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను భయాందోళనను కలిగిస్తూ ఆకట్టుకుంటుంది. ‘వరహ రూపం’ అంటూ సాగే ఈ పాటలో రిషబ్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాట పూర్తయ్యే వరకు ప్రేక్షకులు అందులో లీనమైపోతారు.

అయితే ఈ సాంగ్ తమదేనంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్ర్’ అనే మ్యూజిక్ సంస్థ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే ఆల్బమ్ కు కాపీగా ‘వరహం’ పాటను చిత్రీకరించారని పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై విచారించిన కోర్టు ‘కాంతారా’ లోని ఆ సాంగ్ నిలిపివేయాలంటూ తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు థియేటర్లో గానీ, యూట్యూబ్, ఇతర మ్యూజిక్ ఆల్బమ్ లో గానీ ప్లే చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని థాయికుడమ్ బ్రిడ్స్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టింది. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని పేర్కొంది. అయితే సినిమాకు హైలెట్ గా నిలిచిన ‘వరహం’ సాంగ్ కొనసాగడానికి రిషబ్ శెట్టితో పాటు నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.