Chiranjeevi: చిరంజీవితో పలు చిత్రాల్లో రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ పేరు మాధవి. తెలుగు అమ్మాయి అయిన మాధవి 80-90లలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, భాషల్లో నటించింది. చిరంజీవి-మాధవిలది సూపర్ హిట్ కాంబో. పలు విజయవంతమైన చిత్రాల్లో వీరు జతకట్టారు. ఖైదీ చిరంజీవి స్టార్డం ని మార్చేసిన చిత్రం. దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఖైదీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మాధవితో చిరంజీవి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. సుదీర్ఘ కెరీర్లో మాధవి వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలతో జతకట్టింది. చిరంజీవి-మాధవి ఫెయిర్ మాత్రం చాలా ప్రత్యేకం. కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో మాధవి వివాహం చేసుకుంది. 1996లో రాల్ఫ్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ తో మాధవికి వివాహం జరిగింది. రాల్ఫ్ శర్మ ఓ ఫార్మాసిటికల్ కంపెనీకి అధినేత. న్యూజెర్సీలో మాధవి భర్త, పిల్లలతో ఉంటుంది. వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం.
కాగా పెళ్ళికి ముందు భర్త రాల్ఫ్ శర్మకు మాధవి ఒక చిత్రమైన కండిషన్ పెట్టిందట. వివాహం అనంతరం నా చిత్రాలు నువ్వు చూడటానికి వీల్లేదని భర్తతో ఆమె చెప్పిందట. అందుకు కారణం కూడా మాధవి వెల్లడించింది. తన సినిమాలు చూడటం వలన భర్త తనను ఒక సెలబ్రెటీగా భావించే అవకాశం ఉంది. భర్త ఆమెను ఒక సాధారణ మహిళగానే చూడాలట. తాను ప్రత్యేకం అనే ఆలోచన భర్తకు రాకూడదనే, భర్తతో ఈ ఒప్పందం చేసుకున్నానని మాధవి, అన్నారు.
అయితే మాతృదేవోభవ చిత్రాన్ని మాత్రం మాధవి స్వయంగా భర్తకు చూపించిందట. ఆ మూవీ చూసిన రాల్ఫ్ శర్మ నువ్వు ఓ గొప్ప నటివి అని మెచ్చుకున్నాడట. మాతృదేవోభవ ఆల్ టైం క్లాసిక్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలోని నటనకు మాధవి అనేక అవార్డులు సొంతం చేసుకుంది. నాజర్ మరో ప్రధాన పాత్ర చేశాడు.
విదేశాల్లోనే ఉంటున్న మాధవి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆమె భర్తకు బిజినెస్ వ్యవహారాల్లో సహాయం చేస్తుంది. మాధవి సిల్వర్ స్క్రీన్ కి పూర్తిగా దూరమైంది. భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తుంది. మాధవి చివరిగా నటించిన తెలుగు చిత్రం బిగ్ బాస్. ఈ మూవీలో చిరంజీవి హీరోగా నటించారు. బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. బిగ్ బాస్ 1995లో విడుదలైంది.