Teja Sajja film industry struggle: తేజ సజ్జ బాలనటుడిగా పెద్ద స్టార్ అయ్యుండొచ్చు. కానీ ఆయనకు సినిమాల్లో హీరో రోల్స్ అంత తేలికగా రాలేదని రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు తేజ(Teja Sajja). స్వతహాగా తేజ సజ్జ గొప్పగా స్థిరపడిన కుటుంబానికి చెందిన అబ్బాయే. ఆయనకు సినిమా రంగం కాకపోతే బోలెడన్ని వ్యాపార మార్గాలు ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం లో పుట్టి పెరగడంతో ఆయనకు భవిష్యత్తులో హీరో అవ్వాలనే ఆశ పుట్టింది. కెరీర్ ప్రారంభం రెండు మూడు తప్పటడుగులు వేసినప్పటికీ, హనుమాన్ నుండి మళ్లీ పూర్తి స్థాయిలో గాడిలో పడ్డాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చి, సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంత పెద్ద హిట్ తర్వాత ఆయన చేసిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే ఈ సినిమాకు కూడా అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.
అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే తేజ సజ్జ ఒక ఇంటర్వ్యూ లో తనకు ఒక స్టార్ డైరెక్టర్ చేసిన మోసం గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్న కొత్తల్లో, ఒక స్టార్ డైరెక్టర్ నా వద్దకు వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, అది నాకు చాలా నచ్చింది, 15 రోజుల పాటు షూటింగ్ కూడా చేసాను, కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ,నన్ను ఆ సినిమా నుండి తప్పించి వేరే హీరో ని తీసుకున్నాడు. ఇదేంటి అని ఫోన్ చేసి అడిగితే మిమ్మల్ని కేవలం మాక్ షూటింగ్ కోసమే తీసుకున్నామని చెప్పుకొచ్చాడు అంటూ తేజ సజ్జ వాపోయాడు. ఇలా కెరీర్ ప్రారంభం లో ఒకప్పుడు స్టార్ కిడ్ గా చలామణి అయినా తేజ సజ్జ పరిస్థితే ఇలా ఉంటే, కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చే వాళ్లకు ఎంత కష్టం గా ఉంటుందో ఊహించుకోవచ్చు.
కేవలం ఆ ఒక్క స్టార్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఎంతో మంది నిర్మాతలు కూడా తేజ సజ్జ ని కెరీర్ ప్రారంభం లో ఇలాగే మోసం చేశారట. నీతో సినిమా చేస్తానని ముహూర్తం షాట్ తో సినిమాని ప్రారంభించి, అడ్వాన్స్ చెక్కులు కూడా ఇచ్చేవారని, కానీ అవి బౌన్స్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ‘హనుమాన్’ సినిమా అంత పెద్ద కమర్షియల్ హిట్ అయితే నిర్మాత వచ్చిన లాభాల్లో తేజ సజ్జ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. సినిమా ప్రారంభానికి ముందు అనుకున్న రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసేసుకున్నాడట. మిరాయ్ చిత్రానికి కూడా అంతే. చూస్తుంటే తేజ సజ్జ కి మంచి సినిమా చెయ్యాలని మాత్రమే ఉంది, ప్రస్తుతానికి ఆయన రెమ్యూనరేషన్స్ గురించి ఆలోచించడం లేదని తెలుస్తుంది.