Kamal Haasan: కళగా మొదలైన సినిమా వ్యాపారమైంది. కమర్షియల్ చిత్రాలు పేరుతో పరిశ్రమ మూస ధోరణిలో పోతుంటే తన దారి వేరని నిరూపించిన నటుడు కమల్ హాసన్. ఆయన సినిమాను వ్యాపారంగా, స్టార్డమ్ తెచ్చే ఒక సాధనంగా చూడలేదు. కళగా ఆరాధించాడు. స్టార్డమ్ అనే ఛట్రంలో ఇరుక్కోకుండా మనసుకు నచ్చిన చిత్రాలు చేశారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలి అనుకున్నారు. కోలీవుడ్ కి రజినీకాంత్, కమల్ హాసన్ రెండు కళ్ళైతే… రజినీ కంటే ముందు కమల్ ఫేమ్ తెచ్చుకున్నారు. రజినీకాంత్ తన ఇమేజ్ కి సరిపడే మాస్ కమర్షియల్ చిత్రాలతో అతిపెద్ద స్టార్ గా అవతరించారు. కమల్ మాత్రం కళాత్మక, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ రేసులో వెనుకబడ్డారు.

ప్రయోగాల పరంపరలో కమల్ హాసన్ అనేక పరాజయాలు ఎదుర్కొన్నారు. శరీరాన్ని, మనసును హూనం చేసుకొని చేసిన సినిమాలు కనీస ఆదరణకు నోచుకోలేదు. ఎదురుదెబ్బలు తగులుతున్నా కమల్ హాసన్ ప్రేక్షకుడికి కొత్త చిత్రాలు అందించాలి, తెలియని అనుభూతి పరిచయం చేయాలనే తపన మానుకోలేదు. ఆయన కెరీర్ మొత్తం అలానే సాగింది. భారతీయుడు వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ‘భామనే సత్యభామనే’ వంటి ప్రయోగం ఎవరు చేస్తారు చెప్పండి. ఆ మూవీలో కమల్ వృద్ధ మహిళ పాత్ర చేశారు.
సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న కమల్ హాసన్ తెనాలి, పంచతంత్రం, బ్రహ్మచారి వంటి కామెడీ చిత్రాలు చేశారు. దర్శకుడు కె విశ్వనాథ్-కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన కళాఖండాల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వాతిముత్యం, సాగరసంగమం ఎవరూ టచ్ చేయలేని జోనర్స్. అవి కమల్ హాసన్ మాత్రమే చేయగల సినిమాలు, పాత్రలు. సినిమా డబ్బులు సంపాదించే మార్గంగా కమల్ చూడలేదు. తన కళాతృష్ణను సంతృప్తి పరిచే సాధనంగా చేసుకున్నారు.
ప్రయోగాత్మక చిత్రాల ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే కమల్ ఇతర నిర్మాతలను ఇన్వాల్వ్ చేసేవారు కాదు. సొంత బ్యానర్ లో వాటిని నిర్మించేవారు. కష్టమైనా నష్టమైనా తానే భరించేవారు. సినిమాకు కావాల్సిన ప్రతి అంశంలో ఆయన ప్రావీణ్యత సాధించారు. కమల్ హాసన్ నిత్య విద్యార్థి . బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితా సింగర్ గా కూడా రాణించారు. ఆయన ప్రతిభకు కొలమానం లేదు. ఎలాంటి అవార్డు సరికాదు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు కమల్ బాలనటుడిగానే తానేమిటో నిరూపించుకున్నాడు. జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆరు దశాబ్దాల కెరీర్లో కమల్ సాధించిన విజయాలు, చేరుకున్న మైళ్ళు రాళ్లు, చేసిన ప్రయోగాలు మరో నటుడికి సాధ్యం కానివి. ఇక కమల్ పనైపోయింది ఆయన సినిమాలు ఆడవు అనుకుంటున్న తరుణంలో విక్రమ్ తో తానేమిటో నిరూపించాడు. తన మార్కెట్ ఫ్యాన్ బేస్ చెక్కుచెదరలేదని నిరూపించాడు. విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారతీయుడు 2, మణిరత్నం చిత్రాలతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. 1954 నవంబర్ 7న జన్మించిన కమల్ హాసన్ 68వ ఏట అడుగు పెట్టాడు.