spot_img
Homeఎంటర్టైన్మెంట్చిన్న సినిమాల కన్నీళ్లు తుడిచే ఆలోచన !

చిన్న సినిమాల కన్నీళ్లు తుడిచే ఆలోచన !

Tamil Producers Councilచిన్న సినిమా కన్నీళ్లను సినీ కళామతల్లి పాదాలకు పారాణిగా అద్దాలి అని, సింహం లాంటి పెద్ద సినిమా బోనులోంచి చిట్టెలుక లాంటి చిన్న సినిమా బయటికొచ్చి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేలా చేయాలని, బడా నిర్మాతల మధ్య ఊపిరాడని చిన్న నిర్మాతలకు ఊపిరి అద్దాలని ‘దాసరి’ లాంటి మహామహులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు వాళ్ళు అనంతలోకాలకు ఎగసి పోయారు గాని, చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలకు మాత్రం భరోసాను ఇవ్వలేకపోయారు.

కానీ, హుషారుగా లేచి పరుగులాంటి నడకతో చిన్న నిర్మాత నడిచే రోజు దగ్గర్లోనే ఉందనే ఆశ కలుగుతుంది. త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి తీసుకున్న ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం చిన్న నిర్మాతల బతుకులు మార్చేలా ఉంది. తమిళ ఇండస్ట్రీలో 2015 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. షూటింగ్ పూర్తి అయి విడుద‌ల కాని సినిమాల జాబితాను సేక‌రించి ఆయా దర్శకనిర్మాతలకు బాసటగా నిలువాలని సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఆధ్వ‌ర్యంలో ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్థాపించాల‌ని త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ ఓటీటీ ద్వారా విడుదలకు నోచుకోని సినిమాల‌ను విడుద‌ల చేస్తారు. పైగా చిన్న నిర్మాతల నుండి ఎలాంటి ఫీజులు వసూళ్లు చేయరు. అలాగే ఆయా సినిమాల వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం మొత్తాన్ని ఆ సినిమాల నిర్మాత‌ల‌కే చెందేలా ప్ర‌తిపాద‌న‌ పెట్టి సరికొత్త ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి సభ్యులు.

నిజంగా ఇదొక గొప్ప నిర్ణ‌యం. తెలుగులో కూడా రిలీజ్ కానీ చిన్న సినిమాల‌కు చేయూత ఇవ్వాలి. తెలుగులోనూ ఇలాంటి ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను తెలుగు నిర్మాత మండలి పెట్టాలి. తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ ఇలాంటి ఓటీటీలు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న‌ ప‌రిస్థితుల్లో ఒక చిన్న సినిమాని ఓటీటీల‌కు అమ్ముకోవాలంటే తప్పనిసరిగా పలుకుబడి ఉంటేనే పని అవుతుంది.

అన్నిటికిమించి పేరున్న న‌టీన‌టులు ఉన్న సినిమాల‌కే ఇప్పటి ఓటీటీలు పెద్ద పీట వేస్తాయి, చిన్న సినిమాల‌ వాసన చూడటానికి కూడా బడా ఓటీటీ సంస్థలు అంగీకరించని స్థితి ఉంది. దాంతో చిన్న సినిమాల నిర్మాతలు దారుణంగా నష్టపోతున్నారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా సరే నిర్మాత‌ల మండ‌లే ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలి. ఆ ప్లాట్ ఫామ్ లో చిన్న సినిమాల‌ను తీసుకోని.. ఆయా సినిమాల లాభాల‌న్నీ ఆ సినిమాల నిర్మాత‌ల‌కే అందేలా చర్యలు తీసుకోవాలి.

అవసరం అయితే ప్రభుత్వమే ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలి. ఎందుకంటే సినిమా ప‌రిశ్ర‌మ‌ అంటే చిన్న పరిశ్రమ కాదు. ప్రజలను ప్రభావితం చేయగల బలమైన పరిశ్రమ. పైగా ల‌క్ష‌లాది కుటుంబాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సినిమా పరిశ్రమ పైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ప్ర‌భుత్వానికీ అతి పెద్ద ఆదాయ మార్గాలలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి అనే మార్గాన్ని అన్ని ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version