Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ రికార్డ్స్ ఊచకోత కోస్తున్న ఈ సినిమాలోని జాతర సన్నివేశం గురించి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో అల్లు అర్జున్ నటనని పొగడ్తలతో ముంచి ఎత్తారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ లోకి నిజంగా అమ్మోరు పూనిందా అనే రేంజ్ లో నటించి ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి వెళ్లేలా చేసాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ నటనకి, వేసిన డ్యాన్స్ కి కచ్చితంగా ఆయనకు మరో నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పులేదని చెప్పుకొస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ సన్నివేశం ని చూసి ఊగిపోతున్న ప్రేక్షకులు, అసలు ఆ జాతర విశేషాలలేంటో కచ్చితంగా చూడాలి.
తిరుపతి గంగమ్మ జాతర…రాయలసీమలోనే అతి పెద్ద జన జాతర ఇది. ఈ జాతరని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలతో వారం రోజుల వరకు ఈ జాతరలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఈ గంగమ్మ జాతర అంటే ఏమిటి?, దీనిని ఎలా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ఈ స్టోరీ లో మనం చూడబోతున్నాం. తిరుపతి గ్రామ దేవతగా తాతయ్య గుంట గంగమ్మ ని ప్రజలు పూజిస్తుంటారు. ఈమె చరిత్ర చూస్తే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆరోజుల్లో పాలెగాళ్ళు పాలించేవాళ్ళు. తిరుపతి కి చెందిన ఒక పాలెగాడు తన రాజ్యం లోని యువతులను అత్యాచారం చేసేవాడని, కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి అతనితో గడపాలని ఆంక్షలు విధించేవాడట.
దాంతో ఆ పాలెగాడిని వధించడానికి తిరుపతి కి రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల బలమైన నమ్మకం. యుక్త వయస్సుకి వచ్చిన ఈ గంగమ్మపై కూడా కన్నేసిన ఈ పాలెగాడు ఈమెపై అత్యాచారానికి ప్రయత్నం చేసాడట. దీంతో ఆమె తన విశ్వరూపం చూపించిందంట. అది చూసి వణికిపోయింది ఆ పాలెగాడు భయం తో పారిపోయి ఒక చోట దాక్కున్నాడట. ఆ తర్వాత పాలెగాడిని వెతుకుతూ గంగమ్మ రకరకాల మారువేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం వేసిన గంగమ్మ, రెండవ రోజు బండ వేషంఎం మూడవ రోజు ఆ రెండు వేషాలను కలిపి వేసిందట. అయినప్పటికీ పాలెగాడు కనిపించకపోవడంతో , నాల్గవ రోజు దొరవేషం వేసిందట. తన ప్రభువైన దొర వచ్చాడు అనుకున్న పాలెగాడు బయటకి రావడంతో గంగమ్మ అతడిని అతి క్రూరంగా వధించిందట. ఆ సంఘటనకి గుర్తుగా తిరుపతి తో పాటు చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు ప్రతీ సంవత్సరం గంగమ్మ జాతారని ఘనంగా జరుపుకుంటారట. అలా 900 ఏళ్ళ నుండి ఈ జాతర కొనసాగుతూ వస్తుంది.