Bangladesh: బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది జూలై, ఆగస్టులో జరిగిన అల్లర్లు అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. ఈ అల్లర్ల కారణంగా అధ్యక్షురాలు షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. అయితే విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఈ అల్లర్లకు కారణమైంది. ఈ అల్లర్లను అదనుగా తీసుకున్న కొందరు దుండగులు రెచ్చిపోయారు. దేశంలో విధ్వంసం సృష్టించారు. అధ్యక్ష నివాసంపై దాడిచేశారు. సైనికులు ఉన్నా.. దాడులు ఆగలేదు. దేశంలోని హిందువులపై దాడులు చేశారు. ఇక దేశంలోని పలు జైళ్లపై దుండగులు దాడిచేసి నిప్పంటించారు. దీంతో జైళ్ల నుంచి ఖైదీలు, నేరస్తులు పారీపోయారు. ఇలా పారిపోయినవారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే తాజాగా ప్రకటించారు. నాటి అల్లర్ల కారణంగా 2,200 మంది జైళ్లనుంచి పారిపోయారని వెల్లడించారు. వీరిలో 700 మంది ఆచూకీ దొరకలేదని, స్వేచ్ఛగా తిరుగుతున్నారని జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల సయ్యద్ మొహమ్మద్ మొతాహిర్ హుస్సేన్ తెలిపారు. మిగిలినవారు శిక్ష అనుభవించడానికి స్వచ్ఛందంగా తిరిగి వచ్చారని తెలిపారు. పారిపోయినవారిలో 70 మంది తీవ్రవాదులు, మరణ శిక్ష పడినవారు ఉన్నట్లు పేర్కొన్నారు.
రిజర్వేషన్లపై రగడ..
బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అంశంపై షేఖ్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. ఈ నరిసనల్లో దుండగులు చొరబడ్డారు. అల్లర్లు పెరగడంతో ఐదుసార్లు ప్రధాని పదవి చేపట్టిన షేక్ హసీనాను అధికారం నుంచి తప్పుకున్నారు. రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.
కరుగుగట్టిన నేరస్తులు..
ఇక ఈ సందర్భంగా జరిగిన అల్లర్లతో జైళ్ల నుంచి తప్పించుకున్నవారిలో 11 మంది అగ్రశ్రేణి నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాద గ్రూపు నేతలు ఉన్నారు. 174 మంది కరుడుగట్టిన నేరస్థులు ఉన్నారు. వారి ట్రాక్ కదలికలపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. జూలై 19న సెంట్రల్ నార్సింగ్ జిల్లాలోని జైలుపై బయటి వ్యక్తులు దాడిచేసినట్లు గుర్తించారు. జైలుకు నిప్పంటించి పత్రాలు, రికార్డులు కూడా దగ్ధం చేశారు. ఆగస్టులో పారిపోయిన నేరస్థులను గుర్తించారు. 826 మంది తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలోనే నైరుతి సత్ఖిరా జైలు నుంచి 596 మంది ఖైదీలను దుండగులు విడిపించుకుపోయారని గుర్తించారు.
సర్కార్ చేతగాని తనం..
ఇదిలా ఉంటే.. ఖైదీలు తప్పించుకుపోయి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ వారిని పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మధ్యంతర ప్రభుత్వం కావాలనే వారిని పట్టుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరుడుగట్టిన నేరస్థులు బయట ఉంటే దేశానికి ప్రమాదమని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.