Madharaasi Movie Missed Telugu Hero: కొన్ని కథలను ముట్టుకోకపోవడమే మంచిది. మన టాలీవుడ్ లోనే కాదు, ఇతర ఇండస్ట్రీస్ లో కూడా ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం, ఆ సినిమా భారీ హిట్ లేదా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. హిట్ అయ్యినప్పుడు సదరు హీరో కి చెందిన అభిమానులు ‘అబ్బా..మంచి సూపర్ హిట్ సినిమాని మిస్ అయ్యామే’ అని అనుకోవడం,ఫ్లాప్ అయినప్పుడు మాత్రం ‘హమ్మయ్య..మా హీరో చాలా తెలివిగా తప్పించుకున్నాడు’ అని ఆనందపడడం వంటి సందర్భాలు మనకు ఎన్నోసార్లు కలిగి ఉండొచ్చు. నేడు విడుదలైన ‘మదరాసి'(Madharasi Movie) అనే చిత్రం రెండవ కోవకు చెందిన సినిమా. అమరన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్(Siva Karthikeyan) మురుగదాస్(AR Murugadoss) లాంటి డైరెక్టర్ తో కలిసి పని చేస్తున్నాడు అనే వార్త వచ్చిన రోజే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ చిత్రం విడుదలకు ముందు రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ని చూసి శివ కార్తికేయన్ మళ్లీ సూపర్ హిట్ కొట్టేసాడు, AR మురుగదాస్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అని అంతా అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆరంభం నుండే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టిందని,అందుకే ఫ్లాప్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే మురుగదాస్ ఈ చిత్రాన్ని ముందుగా శివ కార్తికేయన్ తో చెయ్యాలని అనుకోలేదట. ఈ స్క్రిప్ట్ ని ముందుగా ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చెయ్యాలని అనుకున్నాడట. అప్పట్లో ఆయన ఈ స్క్రిప్ట్ ని పట్టుకొని రెండు మూడు సార్లు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు కూడా. కానీ ఆ తర్వాత ఆయన కమిట్మెంట్స్ ని ముందుగా పూర్తి చేసే పనిలో పడడం, ఈలోపు మురుగదాస్ నుండి సర్కార్, దర్బార్ వంటి చిత్రాలు రావడం, వాటిని చూసిన తర్వాత అల్లు అర్జున్ కి ఈయనలో విషయం అయిపోయింది అనే విషయాన్ని గమనించి దూరం పెట్టడం వంటివి జరిగింది. ఒకవేళ ఈ సినిమా అల్లు అర్జున్ ఒప్పుకొని చేసుంటే ఆయన కెరీర్ లో వరుడు లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. తప్పించుకున్నాడు, లక్కీ బాయ్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.