Ambati Rambabu political crisis: కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతోంది. వైసిపి హయాంలో కీలక నేతలందరిపై కేసులు నమోదవుతున్నాయి. మెజారిటీ నేతలపై అవినీతి కేసులు నమోదవుతుండగా.. మరికొందరు పై సోషల్ మీడియాలో అనుచితంగా మాట్లాడినందుకు కేసులు నమోదు చేశారు. అయితే చాలామంది తాజా మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. కానీ ఒకరిద్దరు మంత్రులపై కేసులు నమోదు కాకపోవడంతో వారిపై ఎటువంటి అభియోగాలు లేవని అంతా భావించారు. ప్రధానంగా అంబటి రాంబాబు పై పెద్ద కేసు లేని నమోదు కాలేదు. చిన్నచిన్న కేసుల వారికి ఆయనపై నమోదు కావడంతో ఆయన పెద్దగా రిస్క్ లో లేరని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు వరుసగా ఆయనపై తెగ కేసులు నమోదవుతున్నాయి సొంత పార్టీ వారితో పాటు ఆయన చేతిలో మోసపోయిన బాధితులు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు.
దూకుడు కలిగిన నేత..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అంబటి రాంబాబు ఒక కీలక నేతగా వ్యవహరించారు. అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే నిమిషాలపాటులో విరుచుకుపడేవారు. ఆపై మంచి వాగ్దాటి ఉన్న నాయకుడు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే సుగుణం ఆయన సొంతం. అయితే వైసిపి హయాంలో ఓ యువకుడు చనిపోతే.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి సాయం అందించి.. అందులో సగం తనకు ఇవ్వాలని పట్టు పట్టిన నేతగా కూడా విమర్శ ఉంది ఆయనపై. అప్పట్లోనే ఇదో వైరల్ అంశంగా మారింది. అయితే ఆయనపై అనేక లైంగికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తప్పవని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు విషయంలో ఎందుకో లైట్ తీసుకుంది. అయితే ఆయనపై వరుస ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం పట్టు బిగించే అవకాశం ఉంది.
జగనన్న లేఅవుట్లో స్కాం..
ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలంలో ఒక స్కాం జరిగింది. పది లక్షలకు స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే దాదాపు 200 శాతం రెట్లు పెంచి అమ్మినట్లు విమర్శలు ఉన్నాయి. గతంలోనే సొంత పార్టీ నాయకుడు ఒక్కరు హైకోర్టుకు వెళ్లారు. కానీ అంబటి రాంబాబు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు కదలకుండా ఉంచారు. మరోవైపు తన నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే తప్పకుండా వసూలు చేసే వారన్న ఆరోపణలు అంబటి రాంబాబు పై ఉన్నాయి. మట్టి మాఫియా సైతం ఆయన హయాంలో రాజ్యమేలింది. ఇప్పటివరకు అంబటి బాధితులు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు అవకాశం దొరకడంతో విజిలెన్స్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మున్ముందు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.