వరుస ప్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ కథ కోసం వెతుకున్నాడు. అయితే పూరితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, పూరి ఎన్ని కథలు చెప్పినా ఎన్టీఆర్ కి నచ్చడం లేదు. గతంలో ఎప్పుడో ఓ సందర్భంలో వక్కంతం వంశీ ఒక లైన్ చెప్పాడు. నీచుడు గొప్పవాడిగా ఎలా మారాడు అనేది మెయిన్ పాయింట్. ఎన్టీఆర్ కి ఆ లైన్ గుర్తుకువచ్చింది. వక్కంతం వంశీని – పూరీని కలిపాడు.
వంశీ -పూరీ మధ్య కథా చర్చలు ముగిసాయి. పది రోజులు పాటు ఇద్దరూ కథ పై కుస్తీ పట్టారు. కట్ చేస్తే.. కథ మొత్తం విన్న ఎన్టీఆర్ ఆనందంతో పెద్దగా అరిచాడు. ఆ అరుపు ఆగిపోయే లోపే మన సినిమా పేరు ‘టెంపర్’ అన్నాడు పూరి. అందరూ కష్టపడి సినిమా చేశారు. సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ కి, పూరికి, వంశీకి జీవితంలో గొప్ప విజయాన్ని అందించిన సినిమాగా నిలిచిపోయింది.
నిజానికి విజయంతో పాటు చిత్ర పరిశ్రమలో మంచి గౌరవాన్నిచ్చిన సినిమాగా కూడా ‘టెంపర్’ నిలవడం విశేషం. ఎన్టీఆర్ చేసిన దయ పాత్ర ప్రేక్షకుల మనసుకు బాగా దగ్గర అయింది. అయితే, ఈ సినిమా చేస్తున్నంత సేపు ఎన్టీఆర్ ఎప్పుడు కోపంగా ఉండేవారట. తన పాత్రలో లీనం అయిపోవడం ఎన్టీఆర్ కి అలవాటు.
ఆ అలవాటులోనే ఒక రోజు తన ఇంటి వాచ్ మెన్ పై బాగా సీరియస్ అయ్యాడట. అతని తప్పు లేకపోయినా తారక్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్ధం కాక షాలినిగారు(ఎన్టీఆర్ తల్లిగారు) షాక్ అయ్యారట. అయితే, కోపం తగ్గాక తారక్, మళ్ళీ మాములు మనిషి అయ్యాడు. ఎన్టీఆర్ అంతగా ఇన్ వాల్వ్ అయి నటించాడు కాబట్టే.. ఆ సినిమా అంత గొప్ప హిట్ అయింది.
జనం కూడా ఎన్టీఆర్ నటన పై చర్చించారు. ఒక స్టార్ హీరో అయి ఉండి ఎన్టీఆర్ అలాంటి నెగిటివ్ పాత్ర చేయడానికి ఎలా అంగీకరించాడు అంటూ షాక్ అయ్యారు. కానీ తన వరుస విజయాలకు ఆ సినిమానే పునాదిగా మార్చుకున్నాడు తారక్. అప్పటి నుండి మళ్ళీ ఎన్టీఆర్ అపజయం అనేది చవిచూడలేదు. అందుకే ‘టెంపర్’ను తమిళ్‌లో విశాల్ హీరోగా, హిందీలో రణవీర్‌సింగ్ హీరోగా రీమేక్ చేశారు.