అసలు ముప్పై ఏళ్ల క్రితం తెలుగులో క్లిన్ కామెడీ వచ్చేది. జంధ్యాల గారిలాగా, కె.విశ్వనాథ్, బాపు గారిలాగా క్లీన్ మూవీస్ తీయవచ్చు అనే సంగతే ఇప్పటి మేకర్స్ కి తెలియడం లేదు. తెలిసినా పట్టించుకోవడం లేదు. గతంలో వచ్చిన టీవీ సీరియల్స్ నే తీసుకుందాం. అమృతం లాంటి క్లీన్ కామెడీ సీరియల్ వచ్చి సూపర్ హిట్ అయింది.
కానీ ఇపుడు ఉన్న సీరియల్స్ లో కెమెరా నాలుగు కోణాల నుండి ఫ్లాష్ చేసి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి ఒక్కొక్కరి మొహాలు చూపించి ఒక డైలాగ్ చెప్పిస్తే ఒక ఎపిసోడ్ అయిపోతుంది. ఈ మధ్యలో కావాల్సినంత బూతు బాగోతాలు ఉంటాయి. ఇక పలు షోల గురించి ఏమి చెప్పినా తక్కువే. కురచ దుస్తుల వ్యాఖ్యాతలు, హాస్యం తెలియని జడ్జ్ లు, ప్రోమో కోసం ఎక్స్ట్రా చేసే నటులు ఇలా నానా రచ్చ చేస్తున్నారు.
టీఆర్పీ రేటింగ్ కోసమే కదా ఇదంతా చేస్తోంది. పైగా కొస మెరుపు ఏమిటంటే.. ఈ మధ్య సోషల్ మీడియా తారలు కూడా టీవీ స్క్రీన్స్ పై అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. అంతే లేండి, వాళ్ళకి అవకాశాలు కావాలి, వీళ్ళకి ఆకర్షణ కావాలి. అందుకే అర్ధం పర్దం లేని హాస్యం పుట్టుకొస్తుంది.
చైనా దేశం, నాలుగేళ్ల కిందట మీడియా, టీవీ రంగం మీద పెను ఆంక్షలు విధించింది. వాళ్ళ సంస్కృతీ, బంధాలు దెబ్బ తీసే విధంగా ఎలాంటి షోస్ కాని, సీరియల్స్, సినిమాలు తీయకూడదు అని. మనకు అలాంటి ఆంక్షలు విధిస్తేనే బూతు రాయుళ్లు తగ్గుతారు.