TG Film Chamber New President: ఈ ఏడాది తెలుగు సినిమా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆరంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రావడం తో ఇండస్ట్రీ కి మంచి రోజులు మొదలయ్యాయి అని అంతా అనుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ నెల నుండి సంక్రాంతి వరకు టాలీవుడ్ కి స్వర్ణయుగం నడిచింది అనుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ ‘దేవర’, డిసెంబర్ నెలలో ‘పుష్ప 2’ ఇక ఆ తర్వాత వెంటనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ ని కాపాడాయి అనుకోవచ్చు. ఈ సినిమాలు లేకుంటే సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారేది. తెలంగాణ లో థియేటర్స్ పరిస్థితి గురించి నూతనంగా ఎంపిక కాబడిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్(Sunil Narang) మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. థియేటర్స్ పరిస్థితి ఎంత దయనీయంగా తయారయ్యాయో ఆయన వివరించిన ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేస్తుంది.
ఆయన మాట్లాడుతూ ‘ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ వంటి చిత్రాలు మాత్రమే భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ నష్టాలను చేకూర్చాయి. ఇలా అయితే సింగిల్ స్క్రీన్స్ ని ఎలా నడపాలి. నేడు హీరోలంతా సూపర్ స్టార్స్ రేంజ్ కి ఎదిగారంటే అందుకు కారణం సింగిల్ స్క్రీన్స్. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. స్టార్ హీరోలు సినిమాలు చేయకపోవడం వల్ల థియేటర్స్ మూత పడే పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలేమో 10 లక్షలు తీసుకునే హీరో తదుపరి చిత్రానికి 30 లక్షలు ఇస్తున్నారు. ఇటీవలే ఒక హీరో సినిమా విడుదలై కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేదు. ఆ హీరో కి నిర్మాతలు ఇప్పుడు 13 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు’.
‘స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్స్ వ్యవస్థ నడవడం అసాధ్యం. సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఓనర్స్ మొత్తం ఒక రూఫ్ కిందకి వచ్చాము. మా గ్రూప్ ని ఎగ్జిబిటర్ వస్తే నాలుగు డబ్బులు వస్తాయి. సింగిల్ స్క్రీన్స్ ని కూడా మేము మల్టీ ప్లెక్స్ తరహాలోనే మైంటైన్ చేస్తున్నాం. ప్రేక్షకుడికి కేవలం 80 రూపాయిల్లోనే పాప్ కార్న్, 30 రూపాయలలో కూల్ డ్రింక్స్ ని అందిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. హరి హర వీరమల్లు గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా విడుదల అవుతుందని థియేటర్స్ మొత్తం ఖాళీగా ఉంచి పెట్టాము. ఇప్పుడు ఆ సినిమా రావడం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి?, ఈ నెల 20 వరకు ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ సునీల్ నారంగ్ వాపోయాడు. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం వచ్చే నెలకు వాయిదా పడింది, విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.