Balagam Mogilayya
Balagam Mogilayya : తెలంగాణ జానపద కళాకారుడు మొగిలయ్య బలగం మూవీతో వెలుగులోకి వచ్చాడు. దర్శకుడు వేణు తెరకెక్కించిన బలగం మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదలైంది. మరణం అనంతరం జరగాల్సిన పిట్ట ముట్టుడు అనే నమ్మకం ఆధారంగా బలగం మూవీ తెరకెక్కింది. తెలంగాణ పల్లె సంస్కృతి, బంధువుల అనుబంధాలను వేణు అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ఒక భావోద్వేగ జానపద గీతాన్ని మొగిలయ్య దంపతులు పాడారు.
నిజ జీవితంలో కూడా వారి వృత్తి అదే. సహజత్వం కోసం మొగిలయ్య దంపతులతో పిట్ట ముట్టుడు చోటు వద్ద పాట పాడించారు. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది. పాట వింటూ కుటుంబ సభ్యులు తమ అనుబంధాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం గుండెలను హత్తుకుంటుంది. మొగిలయ్య దంపతుల సాంగ్ బలగం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి బలగం వేణుతో పాటు నిర్మాతలు ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆర్థిక సహాయం చేశారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు, వైద్య ఖర్చులకు ప్రతి నెలా భృతి సైతం ప్రకటించింది. తాజాగా మొగిలయ్య ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం. వరంగల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మొగిలయ్యను అడ్మిట్ చేశారు.
చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. మొగిలయ్య మరణ వార్త విషాదం నింపింది. ముఖ్యంగా బలగం మూవీ అభిమానులు ఆయన పాట గుర్తు చేసుకుని బాధపడుతున్నారు.