Amaravati : అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ఇంకోవైపు రహదారులతో పాటు రైల్వే లైన్ ఏర్పాట్లపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం- నంబూరుల మధ్య నిర్మిస్తున్న అమరావతి రైల్వే లైన్ భూసేకరణ పనులకు తాజాగా ముందడుగు పడింది. ఈ మేరకు కేంద్రం భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో మొత్తం 297 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనిపై అభ్యంతరాలు జనవరి 16 లోపు తెలియజేయాల్సి ఉంటుంది. సలహాలు సూచనలు సైతం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో లిఖితపూర్వకంగా నందిగామ ఆర్డీవోను కలిసి అందిస్తే పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. అందరి వాదనలు విన్న తరువాతే తగిన విధంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.
* కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతికి తెలంగాణ నుంచి అనుసంధించాలన్న ఉద్దేశంతోనే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మొత్తం 297 ఎకరాలకు సంబంధించి భూ సేకరణ చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంచికర్ల మండలం పరిటాలలో 72.42 ఎకరాలు, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, కంచికర్ల మండలం గొట్టుముక్కల లో 50.49 ఎకరాలు, అల్లూరులో 43.15 ఎకరాలు, జుజ్జూరులో 28.89 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26.45 ఎకరాలు, నరసింహారావు పాలెం లో 17.4 ఎకరాలు, గూడెం మాధవరం లో 7.71 ఎకరాలు చొప్పున భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
* ప్రైవేట్ భూములు అధికం
అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన భూముల్లో.. 99 శాతం ప్రైవేట్ భూములే. ఈ మార్గంలో ప్రభుత్వ భూములు చాలా తక్కువ కూడా. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. మరికొన్ని భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి పరిష్కారం అయితే తప్ప సేకరించేందుకు వీలు లేదు. అయితే అభ్యంతరాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది.