Tollywood: 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సినీ కార్మికుల కోసం, సినిమాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని స్థాపించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. కాగా తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల ‘మా’ ఎన్నికలు టాలీవుడ్ లో ఎంతటి రచ్చ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు. ఆ తర్వాత కూడా మా అసోసియేషన్ లో చోటు చేసుకున్నా విషయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఆ తర్వాత తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఎన్నికల నిర్వహణలో కొంత జాప్యం చోటు చేసుకుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఇవి కూడా ‘మా’ ఎలక్షన్స్ లాగే చాలా రసవత్తరంగా మారతాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఎన్నికలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకగ్రీవంగా ముగిశాయి. టీ ఎఫ్ సి సి చైర్మన్‌గా మరోసారి ప్రతాని రామకృష్ణగౌడ్ నియమితులయ్యారు. టీఎఫ్‌సీసీ నూతన కార్యవర్గ కమిటీని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ వైస్‌చైర్మన్లుగా గురురాజ్, డి.కోటేశ్వరరావు, నెహ్రూ, సెక్రటరీలుగా సాయివెంకట్, జె.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తెలంగాణ లోని నటీనటులకు తాము ఎప్పుడు అండగా ఉంటామని… కార్మికులకు అన్ని విషయాల్లో తోడు ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.