Homeఎంటర్టైన్మెంట్Tollywood : వెండితెరపై తెలంగాణ వెలుగులు.. సినిమా టైటిళ్లుగా పల్లెలు, పండుగల పేర్లు!

Tollywood : వెండితెరపై తెలంగాణ వెలుగులు.. సినిమా టైటిళ్లుగా పల్లెలు, పండుగల పేర్లు!

Telangana Cinema: తెలంగాణ.. ఈ పదం ఒకప్పుడు నిషేధానికి గురైంది. అసెంబ్లీ రికార్డ్స్‌లో నుంచి కూడా తొలగించి చిన్నచూపు చూశారు. టైమ్‌ మారింది.. ఆ పదమే పలకడం నేరమన్నచోటే జేజేలు అందుకుంటోంది. వెండితెరపై ఒకప్పుడు విలన్‌ పాత్రలకు మాత్రమే ఆపాదించిన తెలంగాణ యాస, భాష ఇప్పుడు నేను హీరోనంటూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. ఉరుకుల పరుగుల జీవితంలో మట్టివాసనలు మర్చిపోతున్న జనానికి బలగం లాంటి సినిమాలతో మళ్లీ మూలాల్ని గుర్తు చేస్తూ వెండితెరపై మురిసిపోతోంది. అంతే కాకుండా క్రేజీ హీరోలకు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తెచ్చి పెడుతోంది. తెలంగాణ యాసతో సాగే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ తరహా సినిమాల నిర్మాణం జోరందుకుంది. దీంతో ఒక దశలో తెలంగాణ యాసని పలకడానికే ఇష్టపడని వారంతా ఇప్పుడు తెలంగాణం అంటున్నారు.

తెలంగాణ యాసలో ‘పెళ్లి చూపులు’
విజయ్‌ దేవరకొండ హీరోగా పరిచయమైన సినిమా ‘పెళ్లి చూపులు’. కంప్లీట్‌ తెలంగాణ యాసలో సాగిన సినిమా ఇది. తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన ఈ మూవీ విజయ్‌ దేవరకొండకు మంచి విజయాన్ని అందించడమే కాకుండా హీరోగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఇదే సినిమాతో కమెడియన్‌ గా పరిచయమైన ప్రియదర్శికి కూడా మంచి పేరుని అందించడమే కాకుండా వరుస అవకాశాల్ని అందించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ డైలాగ్‌ రైటర్‌గా తరుణ్‌ భాస్కర్‌ కు అవార్డుని తెచ్చి పెట్టింది.

అర్జున్‌రెడ్డి కూడా..
ఇక 2017లో విడుదలైన అర్జున్‌ రెడ్డి సినిమా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. విజయ్‌ దేవరకొండలోని మరో కోణాన్ని బయటపెట్టిన ఈ సినిమా కూడా కంప్లీట్‌ తెలంగాణ యాసతో సాగినదే.

– సాయి పల్లవి నటించిన ఫిదా మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ పల్లెపడుచుగా సాయి పల్లవి తనదైన మార్కు నటనతో ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టి తెలంగాణ యాసలో సాగే సినిమాలకు ఊతమిచ్చింది.

– యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి నటించిన జాతిరత్నాలు కూడా తెలంగాణ యాసలో సాగే సినిమానే. అనుదీప్‌ దర్శకత్వంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని నిర్మించారు. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా బాక్సాఫీస్‌ వద్ద రూ.65 నుంచి రూ.75 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచింది.

– మరో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తెలంగాణ భాష, యాసలో చేసిన ఫలక్‌ నుమా దాస్, అశోక వనంలో అర్జున కల్యాణం అతనికి హీరోగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చి పెట్టాయి. మాస్‌ కా దాస్‌ అంటూ విశ్వక్‌ సేన్‌ క్రేజ్‌ ని పెంచాయి. నాగచైతన్య కూడా శేఖర్‌ కమ్ముల రూపొందించిన చీలవ్‌ స్టోరీచీలో తెలంగాణ యాసతో నటించడం విశేషం. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి చైతుపై ప్రశంసల వర్షం కురిసేలా చేసింది.

హైదరాబాద్‌ యాసతో..
చాలా కాలంగా తను నటించే సినిమాలకు రచనా సహకారం అందిస్తూ వస్తున్న యంగ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. హైదరాబాదీ తెలంగాణ యాసతో తెరకెక్కిన ఈ మూవీ సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌ ని సరికొత్త మలుపు తిప్పి, హీరోగా మంచి క్రేజ్‌ ని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌ గా చీటిల్లు స్క్వేర్‌చీ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు.

బంధాలను తట్టిలేపిన ‘బలగం’
రీసెంట్‌గా కమెడియన్, ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన వేణు దర్శకుడిగా మారి రూపొందించిన బలగం సినిమా కూడా తెలంగాణ యాసతో సాగే మూవీనే. ఇంటి పెద్ద చనిపోతే జరిగే పదకొండు రోజుల తంతు ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది.

పండుగ పేరుతో హిట్టు..
మార్చి 30న విడుదలలైన దసరా సినిమాని కూడా తెలంగాణలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ఈ సినిమా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని సమీపంలో వున్న వీర్లపల్లి లో గ్రామంలో జరిగే సంఘటనల సమాహారంగా సాగింది. ధరణి క్యారెక్టర్‌లో పక్కా తెలంగాణ యువకుడిగా నాని ప్రదర్శించిన నటన ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. వారం రోజుల్లోనూ బాక్సాఫీస్‌ వద్ద వరల్డ్‌ వైడ్‌గా రూ. 100 కోట్లు కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

తెలంగాణ పేర్లు..
గతంలో మా భూమి, దాసి, ఓసేయ్‌ రాములమ్మ, సమ్మక్క సారక్క, బతుకమ్మ, రాజన్న, దసరా సినిమాలు వచ్చాయి. ఈ పేర్లు తెలంగాణలో తప్ప ఎక్కడా వినిపించవు. తాజాగా పల్లెల పేర్లతో సినిమాలు తెరకెక్కి సక్సెస్‌ సాధించాయి. ఓదెల రైల్వే స్టేషన్, భీమదేవరపల్లి బ్రాంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. తాజాగా రుద్రంగి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో మరిన్ని ఈ తరహా సినిమాలు సెట్స్‌ పైకి రావడానికి రెడీ అవుతుండటం విశేషం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular