Kangua : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం. సుమారుగా మూడేళ్ళ పాటు సూర్య ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడు. ఎంతో కష్టపడి మనసు పెట్టి ఈ సినిమా కోసం ఆయన పని చేసాడు. కానీ అదంతా వృధా ప్రయత్నం అయ్యింది. మొదటిరోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాదిస్తుందని అభిమానులు అంచనా వేస్తే, క్లోజింగ్ లో అతి కష్టం మీద వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. ఓటీటీ లో కూడా ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అంతంత మాత్రమే. దీనిని థియేటర్ లో ఎలా భరించారు రా అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ రేస్ లో ఉంది.
2024 ఉత్తమ ఫారిన్ చిత్రం గాను ‘కంగువా’ చిత్రాన్ని ఎంచుకొని ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ కి పంపించారు ఆ చిత్ర మేకర్స్. జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. హాలీవుడ్ తో పాటు వివిధ భాషలకు చెందిన 39 సినిమాలను జ్యూరీ ఎంచుకుంది. మరి కంగువా చిత్రం ఉత్తమ ఫారిన్ చిత్రం క్యాటగిరీ లో నామినేట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నామినేట్ అయితే మాత్రం చరిత్ర సృష్టించిన సినిమా అవ్వబోతుంది. ఎందుకంటే ఒక డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా ఆస్కార్ రేంజ్ కి వెళ్లడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అది కూడా ఒక సౌత్ సినిమా. అయినా ఆస్కార్ కి పంపించేంత గొప్ప కంటెంట్ ఆ సినిమాలో ఉందో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా కాన్సెప్ట్ చాలా మంచిదే, కానీ డైరెక్టర్ శివ దానిని సరైన రీతిలో టేకప్ చేయలేకపోయాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనేక చోట్ల చాలా లౌడ్ గా అనిపించింది. థియేటర్ లో అభిమానులకే తల నొప్పి పుట్టేంత పని అయ్యింది. అలాంటి సినిమాకి ఆస్కార్ లో నామినేషన్ దొరికితే అనేక మంది అసంతృప్తి ని వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ‘రెట్రో’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం గా ఉంది. ఇటీవలే విడుదల చేసిన ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.