Shiva Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థితి గతులను మార్చిన సినిమా ఏదైనా ఉందా అంటే అది శివ(Shiva Movie) చిత్రమే. అప్పటి వరకు తెలుగు కమర్షియల్ సినిమా వేరు, శివ తర్వాత కమర్షియల్ సినిమా వేరు. ఆడియన్స్ సినిమాలను చూసే పద్దతిని మార్చుకునేలా చేసిన చిత్రమిది. టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రమిది. తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తమిళం, హిందీ భాషల్లో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. ఆరోజుల్లోనే అన్ని భాషలకు కలిపి ఈ చిత్రం పది కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే నేటి మార్కెట్ ని బట్టి చూస్తే వెయ్యి కోట్లతో సమానం. అలాంటి సెన్సేషనల్ మూవీ ని ఈ నెల 14న అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
4K టెక్నాలజీ ప్రింట్ , డాల్బీ అట్మాస్ సౌండ్ తో మన అభిమాన థియేటర్స్ లో ఈ చిత్రాన్ని 14 వ తేదీన వీక్షించవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించారు. ఇదంతా పక్కన పెడితే శివ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి ముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక DVD షాప్ కి ఓనర్ గా పని చేస్తూ ఉండేవాడు. ఆ సమయం లోనే శివ మూవీ స్క్రిప్ట్ ని రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని తీస్తే సూపర్ స్టార్ రజినీకాంత్, లేదా మెగాస్టార్ చిరంజీవి తో తియ్యాలి అని ముందుగానే ఫిక్స్ అయ్యాడట రామ్ గోపాల్ వర్మ. మనకు తెలిసిందే బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేని వాళ్లకు అంతటి స్థాయి ఉన్న హీరోలు అపాయింట్మెంట్ ఇవ్వడమే ఎక్కువ, ఇక సినిమా కథ వినడం అత్యాశనే అవుతుంది.
ముందుగా ఈ కథని సూపర్ స్టార్ రజినీకాంత్ కి వినిపించే ప్రయత్నం చాలా వరకు చేసాడట. కానీ కుదరలేదని సమాచారం. ఆ తర్వాత తెలిసిన వాళ్ళతో చిరంజీవి ని కలిసి ఈ కథని వినిపించే ప్రయత్నాలు చేసాడు. అది కూడా కుదర్లేదు. అలాంటి సమయం లోనే నాగార్జున కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చాడు. మజ్ను అనే లవ్ స్టోరీ ని చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. తన విజన్ లో శివ కథ హీరో లక్షణాలు రామ్ గోపాల్ వర్మ కి నాగార్జున లో కూడా కనిపించాయి. చిరంజీవి, రజినీకాంత్ ని కలిసేందుకు ఏ రేంజ్ ప్రయత్నాలు చేసాడో, అదే ప్రయత్నం నాగార్జున విషయం లో కూడా చేసాడు. నాగార్జున అపాయిట్మెంట్ దొరికింది. ఇక ఆ తర్వాత ఈ కథని వినిపించడం, నాగార్జున కి తెగ నచ్చడం, వెంటనే షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం వంటివి జరిగాయి. ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ.