Jubilee hills by poll :
జూబ్లీహిల్స్.. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు.. బాగా డబ్బున్న వ్యక్తులు జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే నివాసం ఉంటుంటారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది.. మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గంలో 2014 నుంచి 2023 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ ఏడాది జూన్ నెలలో కన్నుమూశారు.
ఆయన మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తున్నారు.. గులాబీ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. గులాబీ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సునిత తరఫున ప్రచారం చేస్తున్నారు. బిజెపి నుంచి దిలీప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అందువల్లే ప్రచారాన్ని ఓ స్థాయిలో నిర్వహిస్తున్నాయి.. ఖర్చుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు అన్నిటిని వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయ విశ్లేషకుల పరిశీలన ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ప్రధాన పోటీ గులాబీ పార్టీ
, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని తెలుస్తోంది. పైగా ఇక్కడ నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్లు లక్షకు పైగా ఉన్నారు.. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మాస్ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ వైపు పడుతోందని తెలుస్తోంది. అయితే న్యూట్రల్ ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు సమాచారం. కొందరేమో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతుంటే.. ఇంకొందరేమో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని అంటున్నారు.. మరి కొన్ని వర్గాలు మాత్రం ఈ రెండు పార్టీల మధ్యలో కమలం విజయం సాధించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పోటీ మాత్రం రసవత్తరంగా కనిపిస్తోంది. ఈ ఒక్క ఓటును కూడా కోల్పోవద్దని రాజకీయ పార్టీలు టార్గెట్ పెట్టుకున్నాయి. అన్ని విధాలుగా ఓటర్లను ప్రసన్న చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
