ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే నవతరం హీరోల్లో శర్వానంద్ ముందు వరసలో ఉంటాడు. సాఫ్ట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ ఫీల్ గుడ్ మూవీస్ ను అందిస్తూ.. అందరినీ అలరిస్తుంటాడు శర్వా. ఆయన లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’. శివరాత్రి పర్వదినం సందర్భంగా మంచి హైప్ తో రిలీజ్ అయ్యిందీ సినిమా. మార్నింగ్ షో తర్వాత రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది!
శర్వానంద్ గత చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ సూపర్ గా సాగింది. గత ఫలితాలతో సంబంధం లేకుండా హైప్ కూడా బాగా వచ్చింది. కానీ.. కలెక్షన్లు రాబట్టడంలో తడబడడం ఆశ్చర్యంగా ఉంది. వ్వయసాయం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.4 కోట్లతో వేట మొదలు పెట్టింది. కానీ.. అనూహ్యంగా ఐదు రోజుల్లోనే లక్షల్లోకి పడిపోయింది. ఆ తర్వాత మరో రెండు రోజులకు కలెక్షన్లు ఇంకా దారుణంగా పడిపోయాయి.
రిలీజ్ రోజు 4 కోట్ల షేర్ రాబట్టిన శ్రీకారం.. ఐదవ రోజు కేవలం 30 లక్షలు వసూలు చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 15.50 కోట్ల గ్రాస్ రాబట్టగా.. 9.13 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తం 17.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం.. నష్టపోకుండా ఉండాలంటే ఇంకా 8.37 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మళ్లీ కోట్లలో కలెక్షన్స్ సాధిస్తే తప్ప అది వీలుకాదు. ఈ సినిమాతోనే రిలీజ్ అయిన ‘జాతి రత్నాలు’ హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా శ్రీకారం కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఇక, రాబోయే శుక్రవారం మరిన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటన్నింటినీ తట్టుకొని ఎంతమేర కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.