SP Balu : దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలు సోదరి ఎస్పీ శైలజ భర్త శుభలేఖ సుధాకర్ మాతృమూర్తి కాంతం కన్నుమూశారు. చైన్నెలో ఉంటున్న ఆమె.. ఇటీవల గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ క్రమంలోనే మంగళశారం ఆమె తుదిశ్వాస విడిచారు. రెండేళ్ల క్రితమే శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు కాలం చేశారు. గతేడాది బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్నుమూశారు. ఇప్పుడు సుధాకర్ తల్లి కాంతం ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కృష్ణారావు-కాంతం దంపతులకు మొత్తం ముగ్గురు కుమారులు. వీరిలో శుభలేఖ సుధాకర్ పెద్దవాడు. సుధాకర్ సోదరుల్లో ఒకరు విశాఖలో ఉంటున్నారు. మరో సోదరుడు అట్లాంటలో స్థిరపడ్డారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో కాంతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శుభలేఖ సుధాకర్ తెలుగు వారికి ఎంతో సుపరిచితుడు. ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు సుధాకర్. అయితే.. ఆయన అసలు పేరు సూరావజ్జుల సుధాకర్. ఆయన నటించిన తొలి చిత్రం ‘శుభలేఖ’. ఈ చిత్రంలో ఆయన అద్భుత నటనతో అందరినీ మెప్పించారు. దీంతో.. ఆ చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
డబ్బింగ్ ఆర్టిస్టుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, విలన్ గా తన టాలెంట్ చాటిచెప్పారు. ఆ తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజను వివాహం చేసుకున్నారు. రెండేళ్లలో వీరి కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం అమలుకుంది. శుభలేఖ సుధాకర్ తల్లి మరణం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.