వెండితెరపై ఎవర్ గ్రీన్ జోనర్.. స్పోర్ట్స్. గ్రౌండ్లో ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ను మాత్రమే చూసి ఊగిపోతారు ఫ్యాన్స్. కానీ.. సినిమాలో అదిమాత్రమే కాదు. అంతకు మించి ఉంటుంది. ఎక్కడో మొదలైన వారి ప్రయాణం మైదానం వరకూ ఎలా చేరిందీ? ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎన్ని కష్టాలను అధిగమించారు? అనే విషయాలను పిన్ టూ పిన్ చూపిస్తుంది కాబట్టి.. స్పోర్ట్స్ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే.. ఇప్పటి వరకూ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే.. కేవలం ఒలింపిక్స్ బేస్ లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. నేటినుంచి (జూలై 23) జపాన్ లో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న వేళ ప్రపంచంలో తెరకెక్కిన ఒలింపిక్ సినిమాలను ఓ సారి పరిశీలిద్దాం…
చారియట్స్ ఆఫ్ ఫైర్ః ఇప్పటి వరకు ఒలింపిక్స్ నేపథ్యంలో వచ్చిన అన్ని చిత్రాల్లోనూ టాప్ ప్లేస్ లో ఉంటుందీ చిత్రం. 1924లో నిర్వహించిన ఒలింపిక్స్ లో పాల్గొన్న ఇద్దరు బ్రిటీష్ క్రీడాకారుల జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో బెన్ క్రాస్, చార్లెసన్, నగెల్ హావెర్స్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి ఎన్నో విశేషాలను ఈ సినిమాలో చూపించారు. 1980వ దశకంలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం గొప్పతనం ఏమంటే.. ఇప్పుడు చూసినా కూడా అదే ఫ్రెష్ ఫ్లేవర్ కనిపిస్తుంది.
బాగ్ మిల్కా బాగ్ః భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ బయోపిక్ ఇది. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మిల్కా.. కేవలం 0.1 సెకన్ తేడాతో కాంస్య పతకం చేజార్చుకున్నారు. కామన్ వెల్త్ లో పతకం అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ‘ఫ్లయింగ్ సిఖ్’గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్.. దేశీయంగా ఎన్నో పోటీల్లో విజయాలు అందుకున్నారు. ఈయన జీవితం ఆధారంగా 2013లో బాగ్ మిల్కా బాగ్ చిత్రాన్ని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘ఐ, టోన్యాః’ అమెరికన్ ఫిగర్ స్కేటర్ టోన్యా మాక్సిన్ లైఫ్ స్టోరీనే ‘ఐ, టోన్యా’. మార్గెట్ రాబీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు క్రెయిగ్ గిల్లెస్పీ తెరకెక్కించారు. కామెడీ తరహాలో సాగే ఈ సినిమా.. భావోద్వేగంతో హృదయాలను హత్తుకుంటుంది. టోన్యాకు ఫిగర్ స్కేటర్ కావాలనే కోరిక ఎలా కలిగింది? లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనే అంశాలతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఫాక్స్ క్యాచర్ః అమెరికన్ సోదరులు మార్క్, డేవిడ్ బయోపిక్ ఇది. 1984 ఒలింపిక్స్ లో పాల్గొన్న వీరిద్దరూ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ చిత్రంలో సోదరులుగా టాటమ్, రూఫాలో నటించారు. బెన్నెట్ మిల్లర్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనారోగ్యంతో బాధపడే సోదరులు.. ఒలింపిక్స్ కు ఎలా చేరుకున్నారు? వంటి అంశాలతో రూపొందించిన ఈ చిత్రం అందరినీ అలరించింది.