అయితే, జగ్గయ్య గారితో తనకు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను దర్శకుడు శివ నాగేశ్వర్ రావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జగ్గయ్య గారు షూటింగ్ పూర్తయ్యాక వెళ్లిపోతూ ఉంటే.. శివ నాగేశ్వర్ రావు తడబడుతూ జగ్గయ్య దగ్గరకు వెళ్లి ‘మీరు చెప్పిన డైలాగులో ఐ కాంట్ బదులు ఐ కేంట్ అని ఓ పదం తప్పు పలికారు అన్నారట.
ఆ మాటకు జగ్గయ్య గారు ‘నువ్వెంత చదువుకున్నావు’ అని అడిగారు. శివ నాగేశ్వర్ రావు భయపడుతూనే ‘B.com’ అని చెప్పగానే, ‘నేనెంత చదివానో తెలుసా.. MA HONOURS, దాన్ని కేంట్ అనే చదవాలి’ అని జగ్గయ్య గారు గంభీరంగా చెప్పారు. శివ నాగేశ్వర్ రావు కూడా తగ్గకుండా.. ‘కానీ ప్రేక్షకులలో 90% శాతం నాలాంటి వాళ్ళే ఉంటారు సర్’ అని చెప్పగా..
జగ్గయ్య గారు నవ్వుతూ.. ‘కానీ నేను తప్పు చెపితే మిగిలిన వారు జగ్గయ్య అంత చదివి కూడా తప్పు చెప్పారు అంటారు. కాబట్టి నేను చెప్పిందే ఉంచండి’ అని నవ్వుతూ వెళ్లిపోయారట. ఈ సంఘటనతో జగ్గయ్య గారికి అంకిత భావం నటనలోనే కాదు, జ్ఞానంలోనూ ఉందని అర్ధమవుతుంది. అన్నట్టు జగ్గయ్య గారి గురించి నేటి తరానికి తెలియని విషయాలు ఏమిటో తెలుసా.. ?
జగయ్య గారు గొప్ప చిత్రకారుడు కూడా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి, జగ్గయ్య గారి వయసు 20 ఏళ్లు.. ఆ వయసులోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెనాలిలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. జగ్గయ్య గారు కొన్నాళ్లు పత్రికా రంగంలో కూడా ఉన్నారు. దేశాభిమాని పత్రికలో ఆయన విలేఖరిగా కూడా పనిచేశారు.