Sita Ramam Collections: చిన్న చిత్రాలతో భారీ లాభాలు ఆర్జిస్తోంది వైజయంతీ మూవీస్ సంస్థ. గత ఏడాది ఆ బ్యానర్ లో విడుదలైన జాతి రత్నాలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన జాతి రత్నాలు నిర్మాత అశ్వినీ దత్ కి రెట్టింపులు లాభాలు పంచింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ సీతారామం అదే స్థాయిలో నిర్మాత జేబులు నింపింది. దర్శకుడు హను రాఘవపూడి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా సీతారామం(Sitaramam) చిత్రాన్ని వెండితెరపైకి తెచ్చారు. లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. బలమైన కథకు ఉన్నత నిర్మాణ విలువలు, స్క్రీన్ ప్లే తోడు కావడంతో సీతారామం గొప్ప చిత్రంగా రూపుదిద్దుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో పాటు ఓవర్సీస్లో సీతారామం వసూళ్ల వర్షం కురిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సీతారామం విడుదల చేశారు. అలాగే హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చారు. మిగతా భాషల్లో సీతారామం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు; ప్రతి ఇండస్ట్రీలో విమర్శకుల మెప్పు పొందింది. ఇక సీతారామం నిర్మాతలకు పంచిన లాభాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.
సీతారామం చిత్రానికి నిర్మాత అశ్వినీ దత్ రూ. 51 కోట్ల వరకు పెట్టారట. మొత్తంగా ఆయనకు రూ. 13 కోట్ల లాభం దక్కిందట. ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో లాభాలంటే మాటలు కాదు. స్టార్ హీరోల చిత్రాలు విజయం సాధించినా నిర్మాతకు మిగిలేది అరా కొరా లాభాలే. కానీ కథను నమ్మి ఉన్నతంగా సీతారామం చిత్రాన్ని నిర్మించి అశ్వినీ దత్ మంచి లాభాలు అందుకున్నారు. ఈ మొత్తం ఆయన ప్రభాస్ మూవీపై పెట్టనున్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నిర్మాతగా అశ్వినీ దత్ ఉన్నారు. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే నిర్మించనున్నారు.

కాగా సీతారామం మూవీలో రష్మిక మందాన(Rashmika Mandanna), సుమంత్ కీలక రోల్స్ చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ సైతం ఓ రోల్ చేశారు. వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు సినిమాకు మరో ఆకర్షణ. వరుస పరాజయాలతో పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో విడుదలైన సీతారామం ఊపిరి పోసింది. సీతారామం మూవీతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఓవర్ నైట్ స్టార్ కాగా, దుల్కర్ కి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది.