Bathukamma: తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టి, ప్రకృతితో మమేకమయ్యి.. ఇంటిల్లిపాది జరుపుకునే సంబరం బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతిఏటా భాద్రపద అమావాస్య అంటే.. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో బతుకమ్మలను రోజుకో పేరుతో కొలుస్తారు. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ కోసం ముందు రోజే రకరకాల పువ్వులు కోసుకొని తీసుకొచ్చి, నీళ్లలో వేస్తారు. మర్నాడు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు. అందుకే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారుచేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. ఇది మనకు తెలిసిన బతుకమ్మ. మనం ఆడుతున్న బతుకమ్మ. ఒకప్పుడు బతుకమ్మ ఇలా ఉండేది కాదు. కానీ ఈ బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపింది. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా రగల్ జెండా ఎగరేసింది.

నిజాం వ్యతిరేక ఉద్యమానికి బతుకమ్మకు ఏంటి సంబంధం
బతుకమ్మ అంటే ఇంటిల్లిపాది జరుపుకునే వేడుక. కానీ ఒకప్పుడు బతుకమ్మ ఇలా ఉండేది కాదు. తెలంగాణ ప్రాంతం నైజాం నవాబుల ఆధీనంలో ఉన్నప్పుడు నిరంకుశం రాజ్యమేలేది. అడుగడుగునా రజాకార్లు జనాలను హింసించేవారు. ఈడు వచ్చిన ఆడపిల్లలను ఎత్తుకెళ్లేవారు. కోతకు వచ్చిన పంటను దోచుకెళ్లేవారు. ఇలా ఆ బాధలను పంటి బిగువున భరించిన ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. తెలంగాణ చరిత్ర పుస్తకాలను పరిశీలిస్తే.. నిజాం కు వ్యతిరేకంగా బైరాన్ పల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలు జరిపారని తెలుస్తోంది. ఆ రోజుల్లో ప్రజలపై రకరకాల ఆంక్షలు విధించిన నిజాం.. బతుకమ్మ విషయంలో మాత్రం కొంచెం వెసలు బాటు ఇచ్చేవారు. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రజలు.. బతుకమ్మ పేరుతో అక్కడ ఉద్యమాలకు కార్యచరణ చేసేవారు. రజాకార్లు అడుగడుగునా కాపలా కాస్తున్నా ప్రజలు వాళ్ళ కళ్ళు గప్పి ఉద్యమాలకు రంగం సిద్ధం చేసుకునేవారు. అలా 9 రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో బాహ్య ప్రపంచాన్ని చూసే అవకాశం వారికి లభించేది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే వెసలు బాటు కూడా ఉండేది. ఈ నేపథ్యంలోనే బైరాన్పల్లి లో జరిగిన బతుకమ్మ వేడుకల తర్వాత మొదటి ప్రతిఘటన అక్కడ నుంచే ప్రారంభమైంది అని చెబుతారు.
గడిలో ఆయుధాలు దాచారు
బైరాన్ పల్లి గడిలో బతుకమ్మ ఆడేందుకు వెళ్లిన ప్రజలు విల్లంబులు, గండ్ర గొడ్డళ్ళు అక్కడ పొదల్లో దాచి రజాకార్లపై దాడికి పాల్పడ్డారని సమాచారం. ఇదే తీరుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు ఊపిరి పోసింది బైరాన్ పల్లి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ఇలాంటి వారంతా బతుకమ్మ నేపథ్యంలోనే ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించేవారు. నాటి ఉద్యమంలో వారు అమరులైనప్పటికీ.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బోనకల్ మండలంలోని చిరునోముల, సత్యనారాయణపురం, ముష్టికుంట్ల వంటి గ్రామాల్లో బతుకమ్మ అనేది ఒక సాంస్కృతిక ఉద్యమంగా వినతి చెక్కింది.

ఆ రోజుల్లోనే “బండెనుక బండి గట్టీ 16 బండ్లు గట్టి ఈ బండ్ల పోతావు కొడుకో నైజాం సర్కరోడా” అంటూ పాటలు పాడేవారు. ఇది విన్న రజాకార్లు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. రజాకర్ల దాష్టీకాన్ని తట్టుకోలేక మంది యువకులు పోలీస్ స్టేషన్ పై తిరగబడ్డారు. వీరిలో కొంతమంది రజాకార్ల తూటాలకు బలైనప్పటికీ.. తుపాకులు, మందు గుండు సామాగ్రిని ఉద్యమకారులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం దావనంలా వ్యాపించడంతో మరిన్ని ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసాయి. ఆ తర్వాత నిజాం పాలన అంత మొందింది. ఈనాటికి బతుకమ్మ అనేది ఓ ధిక్కార పతాక.. తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ ప్రధాన పాత్ర పోషించింది. దానిని తెలంగాణకు ఎవరూ కొత్తగా పరిచయం చేయలేదు. చేసేంత స్థాయికి తెలంగాణ ఎప్పుడూ దిగ జారలేదు.