Sirivennela: ప్రముఖ తెలుగు సినీ రచయిత సిరివెన్నెల అంతిమయాత్ర ముగిసింది. జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో హిందూ సంప్రదాయ పద్దతిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చివరగా ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఫిల్మ్ చాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు ఆయన భౌతికగాయాన్ని తీసుకొచ్చారు. ఈ అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు.
సిరివెన్నెల మృతితో యావత్ సినీలోకం మూగపోయింది. ఇక ఆయన లేరనే నిజం తట్టుకోలేక పలువురు సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్, రానా, నాని, రామ్‌చరణ్ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు.
సిరివెన్నెల సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ జనాన్ని నిగ్గదీసి అడిగి.. తన పదసంపద ఒంపుల్లో ప్రేమ, బాధ, కరుణ, రౌద్రం.. ఇలా నవరసాలను పండంచిన వ్యక్తి సిరివెన్నెల. ఏదైనా పాట రాయాలంటే..పెన్ను సిరాలోంచి అక్షరాలు తూటాల్లా దూసుకెళ్లి వస్తుంటాయి. ప్రతి మనసును కదిలించి.. నిద్ర లేకుండా చేస్తాయి. అంతటి శక్తి ఆయన రచనా సాహిత్యానికి ఉంది. ఇప్పటికీ ఎన్నో నిద్రలేన రాత్రుల్లో.. చీకటి పొరల్ని చీల్చుకుని వచ్చే వెలుగులా తన అక్షరాల్ని జనాలపై సంధించారు సిరివెన్నెల. చివరకు ఆ కలం కదలిక లేకుండా ఆగిపోయింది. గగనం శిఖరాల్లో కలిసిపోయింది.