
‘స్టార్ట్ కెమరా.. రోలింగ్.. యాక్షన్.. కట్’ అంటూ టాలీవుడ్ మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయింది. ఆల్ రెడీ ఇప్పటికే కొన్ని సినిమాలు తమ షూటింగ్స్ ను మొదలుపెట్టాయి. మరికొన్ని కొత్త సినిమాలు షూటింగ్స్ కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఆగస్టు నుండి అన్ని చిత్రాలు షూటింగ్ ను షురూ చేయనున్నాయి కాబట్టి, నటీనటులు కూడా షూటింగ్ కోసం సన్నద్ధం అవుతున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ కూడా ప్రస్తుతం లావు పెరిగే పనిలో పడింది. మొన్నటి వరకు జిమ్ లోనే ఎక్కువ కాలం గడిపిన ఈ ముదురు భామ, తాజాగా బాగా తినేసి బాగా ఒళ్ళు చేసే పనిలో ఉంది. ఇంతకీ ఎందుకు ఈ అదనపు లావు అంటే.. శృతి హాసన్, గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటిస్తోందని.. అయితే సాధారణ హౌస్ వైఫ్ పాత్ర కాబట్టి, ఆమె ఈ సినిమా కోసం లావు పెరగనుంది.
అందుకే గత కొన్ని రోజులుగా శృతి హాసన్ లావు పెరగడానికి ఫుడ్ పై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. నిజానికి శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో బాగా సన్నబడింది. అందుకే ఇప్పుడు వర్కౌట్స్ కూడా మానేసి, బరువు పెరగడానికి బలంగా తినాల్సి వస్తోంది. ఎలాగూ బాలయ్య సరసన హీరోయిన్ కాబట్టి, ఎంత లావుగా ఉన్న పర్వాలేదు.
అసలు మొదట్లో శృతి హాసన్, బాలకృష్ణ సరసన నటించడానికి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి హాసన్ తో మంచి బంధం ఉండటం, పైగా ఆమెకు రెండు సార్లు గోపీచంద్ బ్రేక్ ఇవ్వడంతో.. అతని రిక్వెస్ట్ ను కాదు అనలేక శృతి హాసన్, బాలయ్య పక్కన నటించడానికి ఒప్పుకుంది. మరి బాలయ్య – శృతి హాసన్ జోడీ ఎలా ఉంటుందో చూడాలి.