Shiva Re-Release Collections: టాలీవుడ్ లో మళ్లీ రీ రిలీజ్ ట్రెండ్ జోరు అందుకుంది. రీసెంట్ గానే రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ ని కలిపి ‘బాహుబలి : ది ఎపిక్’ గా మారుస్తూ గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసాడు. రెస్పాన్స్ అదిరిపోయింది. అసలు రీ రిలీజ్ కి అర్థం ఏంటో తెలిసేలా చేసింది ఈ చిత్రం. అంత చిత్తశుద్ధితో సరికొత్త టెక్నాలజీ ని జోడించి, గ్రాండ్ గా ప్రొమోషన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అదే తరహా లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన శివ(Shiva 4k Re Release) చిత్రాన్ని కూడా నేడు విడుదల చేసాడు. నేటి తరం యువత ఇప్పటి వరకు ఈ సినిమాని చూడకపోవడంతో పాటు, స్టార్ హీరోలు, స్టార్ దర్శకులందరి చేత ప్రొమోషన్స్ చేయించడం తో ఈ సినిమా పై హైప్ ఆడియన్స్ లో భారీ గా పెరిగింది.
అంతటి హైప్ తో నేడు విడుదలైన ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తో 1989 వ సంవత్సరం లో సినిమా రావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందని, అసలు థియేటర్ లో సినిమా చూస్తున్నంతసేపు పాత సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలగలేదని, కొత్త సినిమాని చూస్తున్నట్టుగానే అనిపించిందని అంటున్నారు ప్రేక్షకులు. విడుదలకు ముందు దాదాపుగా 20 వేల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయాయి. ఇక నేడు ఈ చిత్రానికి బుక్ మై షో లో ఇప్పటి వరకు 16 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈమధ్య కాలం లో నాగార్జున కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి టికెట్స్ అమ్ముడుపోవడం కష్టమే, ఆయన మార్కెట్ అలా పడిపోయింది. అలాంటిది ఆయన పాత సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
కచ్చితంగా శివ చిత్రం మొదటి రిలీజ్ లోనే కాదు, రీ రిలీజ్ లో కూడా అక్కినేని ఫ్యాన్స్ కి మరపురాని జ్ఞాపకాలను అందించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేడు దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ‘కాంతా’ అనే చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాని కూడా ‘శివ’ రీ రిలీజ్ అనేక ప్రాంతాల్లో డామినేట్ చేసింది. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా లాంగ్ రన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఫుల్ రన్ లో మరో మూడు కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టగలిగే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ రీ రిలీజ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.