A lesson for BRS: 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు. తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ… అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కెసిఆర్ బయటికి వచ్చి.. ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం రాకపోగా.. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న ఇజ్జత్ మొత్తం పోయింది. మొత్తంగా చూస్తే రెండుసార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితం వచ్చిన తర్వాత.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఎంతో ఆసక్తి కలిగించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను ఓటమిపాలైంది.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కెసిఆర్ ప్రచారం చేయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్ గా కెసిఆర్ ఉన్నప్పటికీ.. ఆయన ప్రచారానికి రాలేదు. వాస్తవానికి జూబ్లీహిల్స్ అనేది గులాబీ పార్టీ కచ్చితంగా గెలవాల్సిన సీటు. పైగా ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. సానుభూతి ఓటు కూడా ఉంది. పైగా మీడియా, సోషల్ మీడియా సపోర్ట్ విపరీతంగా ఉంది. 2023లో ఇదే స్థానంలో ఓటర్లు గులాబీ పార్టీకి జై కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక తీరుగా ఉంటే.. ఇక్కడ మాత్రం ఓటర్లు డిఫరెంట్ ఫలితాన్ని గులాబీ పార్టీకి అందించారు. ఏడాదిన్నర వ్యవధిలోనే పరిస్థితి మొత్తం మారిపోయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని గులాబీ పార్టీ ఒక గుణపాఠంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేకపోతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అనేక తప్పులు దొర్లుతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా గులాబీ పార్టీని ప్రజలు దేకడం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పటికీ ఆ వ్యతిరేకత తగ్గడం లేదు. అప్పుడెప్పుడో గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా కెసిఆర్ బయటకు వచ్చారు. ఇంతవరకు జనం ముఖం చూసిన దాఖలాలు లేవు. అసలు తాను ఒక ఎమ్మెల్యేనని.. మాజీ ముఖ్యమంత్రిననే విషయం కెసిఆర్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. ఇది ఆయనకు పూర్తి వ్యతిరేకతను కలిగిస్తోంది.
వాస్తవానికి అనేక విషయాలలో కెసిఆర్ ను శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ ఎందుకనో వెనక్కి తగ్గుతున్నాడు. కానీ జనాల్లో మాత్రం విపరీతమైన, విస్తృతమైన అవగాహన తీసుకురాగలిగాడు. సున్నితను అడ్డం పెట్టుకొని సానుభూతి ఓట్లు సాధించాలని గులాబీ పార్టీ అనుకుంటే.. కవిత ఫ్యాక్టర్ ద్వారా దానికి దెబ్బ కొట్టాడు రేవంత్. పైగా సునీత మీద మొదటి భార్య, మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపణలు కూడా చేశారు. వీటిని రేవంత్ బలంగా జనంలోకి తీసుకెళ్లాడు. పైగా గులాబీ పార్టీలో బైపోలు స్ట్రాటజిస్ట్ గా పేరుపొందిన హరీష్ రావు తండ్రి మరణం వల్ల ఫీల్డ్ లోకి రాలేకపోయాడు. ఇంటి వద్ద నుంచి ఆయన అనేక రకాలుగా సూచనలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కెసిఆర్ జనంలోకి రాలేదు. కవిత కూడా దూరంగా ఉండిపోయింది. దీంతో కేటీఆర్ బలం సరిపోలేదు. రేవంత్ వేసిన ఎత్తుల ముందు అది నిలబడలేదు.
గతంలో గులాబీ పార్టీకి సెటిలర్ల ఓట్లు గంప గుత్తగా పడేవి. ఇప్పుడు సెటిలర్లు తమ ఆలోచన విధానం మార్చుకున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది ఎందుకని సైలెంట్ అయిపోయారు. అందువల్లే భారీగా మీటింగ్లు పెట్టుకుని కాంగ్రెస్ కు జై కొట్టారు. అంతేకాదు గులాబీ పార్టీలో బలమైన కమ్మ నాయకులు ఫీల్డ్ లోకి రాలేదు. వాస్తవానికి కమ్మనాయకులతో ప్రచారం చేయించాలనే సోయి గులాబీ పార్టీ నాయకత్వానికి రాలేదు.
పైగా గతంలో గులాబీ పార్టీకి మజ్లీస్ అండగా ఉండేది. అఫ్కోర్స్ ఆ పార్టీ అధికారంలో ఎవరు ఉంటే వారికే జై కొడుతుంది. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీలో లేదు. దీంతో మైనార్టీ ఓట్లకు భారీగా గండి పడింది. బిజెపి నిశ్శబ్దంగా ఉంటే హిందూ ఓట్లు గులాబీ పార్టీకి టర్న్ అయ్యేవి. తద్వారా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వాదానికి దెబ్బ పడేది. కానీ ఈసారి ఇవేవీ వర్కౌట్ కాలేదు. హైదరాబాదులో నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ చాలా ప్రత్యేకమైనది. పసుపు పార్టీ, గులాబీ పార్టీలకు అండగా నిలిచిన ఈ నియోజకవర్గం ఇప్పుడు మూడు రంగుల పార్టీ వైపు వెళ్లిపోయింది. అంతేకాదు వెళ్తూ వెళ్తూ గులాబీ పార్టీకి బలమైన గుణపాఠాన్ని నేర్పి వెళ్లిపోయింది.