Top Taxpayers : ఎంతో మంది అభిమానం సంపాదించుకుంటూ వెండి తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరోలమని అనిపించుకుంటున్నారు కొందరు హీరోలు. క్రమం తప్పకుండా పన్నులు చెల్లించుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ సెలబ్రిటీలు ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తు్న్నారో తెలుసుకుందాం. షారుక్ ఖాన్ ని కింగ్ ఖాన్ అని పిలుస్తారు. దాదాపు 40ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ తన ఆధిపత్యం, సంపాదన పరంగానే కాకుండా పన్నులు చెల్లించడంలో కూడా అగ్రస్థానంలో నిలిచారు. పన్నులు చెల్లించే విషయంలో కూడా దేశంలోని మొదటి ఐదుగురు వ్యక్తులను పరిశీలిస్తే షారుక్ ఖాన్ పేరు అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుతూ.. షారుక్ ఖాన్ మొత్తం రూ. 92 కోట్ల పన్ను చెల్లించి అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచారు. గత ఏడాది షారుఖ్ నటించిన మూడు చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డింకీ’ విడుదలయ్యాయి, ఇందులో ‘పఠాన్’, ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో కొత్త రికార్డులను నమోదు చేశాయి.
రెండవ స్థానంలో విజయ్
సంపాదన, పన్నులు చెల్లించే విషయంలో రెండో స్థానంలో బాలీవుడ్‌కి సంబంధించిన సెలబ్రిటీలు లేరు. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించినవారు. ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా సినిమాలకు దూరమవుతున్నట్లు సూచించిన దళపతి విజయ్ దాదాపు రూ. 80 కోట్ల పన్ను చెల్లించి షారుక్ ఖాన్ తర్వాత అత్యధికంగా పన్ను చెల్లించే సెలబ్రిటీగా నిలిచాడు.
మూడో స్థానంలో బాలీవుడ్ భాయిజాన్
టాక్స్ కట్టే విషయంలో మూడో స్థానంలో నిలిచిన సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా మరోసారి ప్రజల గుండెల్లో నిలిచాడు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సల్మాన్ ఖాన్ మొత్తం రూ.75 కోట్ల పన్ను చెల్లించి పన్ను చెల్లింపుదారుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు.
నాలుగో స్థానంలో షాహెన్‌షా బిగ్ బి
గత 24 ఏళ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్‌కు నటనా చక్రవర్తిగా పేరుంది. అతను సల్మాన్ ఖాన్ కంటే 4 కోట్లు తక్కువ పన్ను చెల్లించారు. అంటే 71 కోట్ల రూపాయల పన్ను చెల్లించి, బిగ్ బి టాప్ 5 లో తన స్థానాన్ని నిర్ధారించుకున్నాడు.
టాప్ 5లో క్రికెటర్ విరాట్ కోహ్లీ
వ్యక్తులుగా అత్యధిక పన్ను చెల్లింపుదారుల టాప్ 5 జాబితాలో బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు నటులు, దక్షిణాదికి చెందిన ఒకరు ఉండగా, నటులు కాని వ్యక్తికి ఐదవ స్థానం లభించింది. అతను మరెవరో కాదు ప్రముఖ క్రికెటర్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ. 66 కోట్లు పన్ను చెల్లించి ఈ జాబితాలో ఐదో స్థానం సాధించాడు.