Samantha: సినిమా ఓ రంగుల ప్రపంచం.. ఆ ఇండస్ట్రీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా అవన్నీ కామన్ అన్నట్లుగానే ఇండస్ట్రీ పెద్దలు, పోలీసులు, పాలకులు భావిస్తుంటారు. ఏదైనా సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే మాత్రమే స్పందిస్తారు. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్, మీటూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. అన్నీ ఉంటాయని తెలిసే ఇండస్ట్రీలోకి వస్తున్న మహిళలు, యువతుల… ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నప్పుడు మౌనంగా ఉండి.. అవకాశాలు తగ్గాక.. సంచలనాలకు తెరలేపుతున్నారు. కాస్టింగ్‌కౌచ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మళయాల చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొంది. ఇది ఇప్పుడు మళయాల ఇండస్ట్రీని కుదిపేస్తోంది. పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతలకూ హేమ కమిటీ సెగ తాకుతోంది. అందరూ స్పందిస్తున్నారు. చాలా మంది మహిళా నటులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి సమంత.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు, సమస్యలపై ఇచ్చిన నివేదికను వెల్లడించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు.
సమంత స్పందన ఇలా..
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదికపైన సమంత స్పందించారు. హేమ కమిటీ నివేదిక పని తీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సంస్థనూ అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు.
తెలంగాణ సీఎంకు వినతి..
తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక కోసం సమంత పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో సమంత చేసిన పోస్టులో.. ’తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలి’ అ ని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఏమిటి?
పోస్టులో తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని సమంత కోరారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాల పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమంత చేసిన అప్పీల్ పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సమంత నివేదిక కోరడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే నాగచైతన్య–సమంత విడిపోవడానికి ఓ సినిమా కరణమన్న ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ కూడా కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సమంత తాజాగా ఇండస్ట్రీ నివేదిక కోరడం చర్చనీయాంశమైంది. తాను గతంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. లేక ఎదుర్కొన్నవారి ఇబ్బందులు తెలుసుకుని ఇలా అడుగుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.