Skylab: సినిమా ఏదైనా అందులో కొత్తదనాన్ని ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందుకుంటున్న నటుడు సత్యదేవ్. ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య, తిమ్మరసు వంటి సినిమాలతో వరుస ప్రయోగాలను చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. తాజాగా, సత్యదేవ్, నిత్యామేనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు పృథ్వీ పిన్నమరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వాస్తవ ఘటనలకు కాస్త హ్యూమర్ యాడ్ చేసి ఎంతో చక్కగా చూపించారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

బండ లింగపల్లి అనే గ్రామంలో నివసించే గౌరమ్మ ప్రతిబింబం అనే వార్తాపత్రికల్లో పనిచేస్తుంటుంది. చిన్న వార్తలు కాకుండా ఏవైనా బ్రేకింగ్ న్యూస్‌ల కోసం వెతుకుతూ ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే కుర్రాడు డబ్బు కోసం ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాడు. అక్కడ సుబేదార్ రామారావు పరిచయమవుతాడు. ఇద్దరూ మనీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. అనుకోకుండా అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి.
దీంతో ఆ గ్రామంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. ఈ వార్తను తనకనుగుణంగా మలుచుకోవడానికి గౌరీ, ఆనంద్, రామారావు ప్రయత్నించడం, ఆ గ్రహ శకలాలు ఆ గ్రామంలో పడకుండా గ్రామస్థులు చిత్ర విచిత్రమైన పద్ధతులు పాటించడం హాస్యభరితంగా చూపించారు. మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తిగా కట్ చేశారు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ వారి పాత్రలకు జీవం పోసినట్లు కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో ఫన్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందిన ఈ మూవీని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ మరో హిట్ కొడతారేమో చూడాలి.
