Sathyaraj: నటుడు సత్యరాజ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి నాదాంబాళ్ కళింగరాయర్ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. శుక్రవారం ఆమె ఆరోగ్యం విషమించడంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. నాదాంబాళ్ కళింగరాయర్ మరణించే సమయంలో సత్యరాజ్ హైదరాబాద్ లో ఉన్నారు. షూటింగ్ లో పాల్గొంటున్న సత్యరాజ్ కి తల్లి మరణవార్త తెలిసిన వెంటనే హుటాహుటిన చెన్నై వెళ్లారు.
నాదాంబాళ్ కళింగరాయర్ కి ముగ్గురు సంతానం. సత్యరాజ్ తో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మా అమ్మకు నా సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి సినిమా తప్పకుండా చూస్తుందని గతంలో పలుమార్లు చెప్పారు. నాదాంబాళ్ మరణవార్తతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. సత్యరాజ్ అభిమానులు, చిత్ర ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కాగా సత్యరాజ్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో హీరో కూడా నటించారు. ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ఆయనకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర ఇండియా వైడ్ ప్రాచుర్యం పొందింది. మిర్చి, ప్రతిరోజూ పండగే, జెర్సీ వంటి చిత్రాల్లో సత్యరాజ్ అద్భుతమైన పాత్రలు చేశారు.