
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీ విషయంలో మహేష్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు.. అవినీతిని వెలికితీసే కథాంశంతో ఈ మూవీ రాబోతుంది. దర్శకుడు పర్శురాం ఈ మూవీని ఇండియాతోపాటు అమెరికాలో తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నాడు.
టాలీవుడ్లో ఇప్పుడిప్పుడు సినిమాల సందడి మొదలైంది. మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరునికెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ మూవీ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత పర్శురాం దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ చేసేందుకు రెడీ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సినిమా ఫస్టు లుక్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.
అయితే కరోనా కారణంగా ‘సర్కారువారిపాట’ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్ పూర్తి చేయాలని మహేష్ బాబు దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. అమెరికాలో సింగిల్ షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం ఇండియాలో సినిమా షూటింగ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఈమేరకు చిత్రయూనిట్ అమెరికా వెళ్లేందుకు సన్నహాలు చేస్తోంది.
‘సర్కారువారిపాట’ అమెరికాలో ఏకధాటికి 45రోజులు షూటింగ్ చేసుకోనుందనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు మహేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాలో షూటింగు ప్రారంభానికి ముందే నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల కూర్పుపై మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ముందుగా పీఎస్ వినోద్ ను కెమెరామెన్ గా ప్రకటించారు. ప్రస్తుతం వినోద్ ‘వకీల్ సాబ్’ కు కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. ఈ మూవీ ఆలస్యం కారణంగా వినోద్ ను తప్పించి మదిని కెమెరామెన్ గా తీసుకున్నారు.
ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీలో నటించే నటీనటులుపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వచ్చే ఏడాది విజయ దశమికి ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్.. 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ‘సర్కారువారిపాట’ను నిర్మిస్తుండగా.. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Comments are closed.