Sharath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురయ్యారు. ఆయన శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణించారు. 71ఏళ్ల శరత్ బాబు మృతిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు, రాజకీయవేత్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు.
శరత్ బాబుకు వారసులు లేరు. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. మొదటి భార్య రమాప్రభతో కానీ రెండో భార్యతో కానీ పిల్లల్ని కనలేదు. ఇద్దరితో శరత్ బాబు విడిపోయారు. అయితే శరత్ బాబుకు ఒక కోరిక ఉంది. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. తిరుపతికి సమీపంలో గల హార్స్లీ హిల్స్ శరత్ బాబుకు ఇష్టమైన ప్రదేశం అట. అక్కడ ఇల్లు కట్టుకొని శేష జీవితం గడిపేద్దాం అనుకున్నాడట. ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడట. చివరికి పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో శరత్ బాబు చివరి కోరిక నెరవేరలేదు.
శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. చదువు పూర్తి కాగానే మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. చక్కని రూపం కలిగిన శరత్ బాబుకు హీరోగా ఛాన్స్ వచ్చింది. 1973లో విడుదలైన రామరాజ్యం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. శరత్ బాబు 250కి పైగా చిత్రాల్లో నటించారు.
వకీల్ సాబ్ మూవీలో ఆయన లాయర్ పాత్ర చేశారు. శరత్ బాబు చివరి చిత్రం మళ్ళీ పెళ్లి. నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను ఆయన చేశారు. మళ్ళీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. దేశ ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు. నటుడు నరేష్ ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మళ్ళీ పెళ్లి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.