IPL-2023 : ఛాంపియన్ జట్లు ముంబై, చెన్నైను భయపెడుతున్న ఆ లెక్కలు..!

మొత్తానికి సెంటిమెంట్ ప్రకారం ఈ రెండు జట్లు మరోసారి ఓడిపోతాయా..? లేకపోతే కీలకమైన ఛాంపియన్ ఆట తీరు చూపిస్తాయా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు మంగళవారం రంగం సిద్ధమవుతోంది. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ ఎలా జరగబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Written By: BS, Updated On : May 23, 2023 9:58 am
Follow us on

IPL-2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మొదటి, రెండు స్థానాల్లో ఉంటాయి. ఈ రెండు జట్లు ఏకంగా తొమ్మిది టైటిళ్లు గెలిచి మరో టైటిల్ రేసులో ఉన్నాయి. టోర్నీలో ఈ రెండు జట్లు మిగిలిన జట్లకు కొరకరాని కోయ్యిగా మారుతున్నాయి. అయితే, అటువంటి జట్లను ఒక విషయం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఈ రెండు జట్లను భయపెడుతున్న ఆ విషయం ఏంటో మీరు చదివేయండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ చివరి దశకు వచ్చేసింది. మార్చి 31న ప్రారంభమైన 16వ సీజన్ ఆదివారం జరిగిన మ్యాచ్ తో లీగ్ దశ ముగిసింది. ఈ వారంలో ప్లే ఆఫ్ మ్యాచులు కూడా ముగియనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచగా.. మిగిలిన మ్యాచులు రెట్టింపు వినోదాన్ని అందించేందుకు వస్తున్నాయి. దీనిలో భాగంగా టాప్-2 లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. శుక్రవారం క్వాలిఫైయర్ 2, ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఇప్పుడు చెన్నై, ముంబై జట్లను ఒక విషయం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆ జట్లపై ఒక్కసారి గెలవని చెన్నై, ముంబై జట్లు..
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఐపిఎల్ ప్రయాణం చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఒకటి, రెండు సీజన్ల మినహా అన్ని టోర్నీల్లోనూ ఈ జట్లు అదరగొట్టాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు తొమ్మిది టైటిళ్లు గెలుచుకున్నాయి. ఐదోసారి ఛాంపియన్ గా నిలిచేందుకు చెన్నై, ఆరోసారి కప్ కొట్టాలన్న లక్ష్యంతో ముంబై జట్టు కసిగా ఉన్నాయి. విజయవంతమైన ఈ రెండు జట్లను ఇప్పుడు ఒక విషయం భయాందోళనకు గురి చేస్తోంది. అదే గెలుపు భయం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెన్నై జట్టు గుజరాత్ మీద, ముంబై జట్టు లక్నో మీద గెలవకపోవడం గమనార్హం. ఇదే ఇప్పుడు ఆ రెండు జట్లను ఆందోళన పెడుతుంది. ఈ రెండు కొత్త జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే ఒక్క గెలుపు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ రికార్డు ప్రస్తుతం ఆ రెండు జట్ల అభిమానులను టెన్షన్ పెడుతోంది.
గణాంకాలు చూస్తే ఆందోళన తప్పదు..
ఈ నాలుగు జట్ల మధ్య జరిగిన మ్యాచులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే అభిమానుల ఆందోళన మరింత రెట్టింపు అవుతుంది.  ఇప్పటి వరకు ముంబై, లక్నో మూడుసార్లు తలపడగా.. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ లక్నో జట్టే విజయం సాధించింది. ఇక గుజరాత్, చెన్నై జట్ల మధ్య చూసుకుంటే చెన్నై కూడా ఆడిన మూడు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. చెన్నై – గుజరాత్, ముంబై – లక్నో జట్లు ప్లే ఆఫ్ లో ఇప్పటి వరకు ఎదురుపడలేదు. అయితే, ఛాంపియన్ అయిన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్ ఎలా ఆడాలో బాగా తెలుసు. పైగా జట్టులో కావాల్సినంత అనుభవం కూడా ఉంది. ప్లే ఆఫ్ రికార్డు చూసుకుంటే మాత్రం చెన్నై, ముంబై ఓడిపోవడం దాదాపు అసాధ్యం అని నిపుణుల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే విజయం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి సెంటిమెంట్ ప్రకారం ఈ రెండు జట్లు మరోసారి ఓడిపోతాయా..? లేకపోతే కీలకమైన ఛాంపియన్ ఆట తీరు చూపిస్తాయా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు మంగళవారం రంగం సిద్ధమవుతోంది. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ ఎలా జరగబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.