తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, పారిశ్రామికవేత్త యం.గంగయ్య కన్నుమూశారు. యం.గంగయ్య రాజమండ్రిలోని హాస్పిటల్లో చికత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొన్నినెలలుగా గుండెపోటుతో బాధపడుతున్నారు. అయితే ఆయన కరోనా కారణంగా చనిపోయాడని వార్తలు రావడం దురదృష్టకరం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా కారణంగా మృతి చెందగా, తాజాగా నిర్మాత డాక్టర్ యం.గంగయ్య కూడా అలాగే కన్నుమూసారని రూమర్స్ ను క్రియేట్ చేశారు.
కాగా అనారోగ్య కారణాలతోనే బుధవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా తన ప్రయాణంలో, అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంకీర్తన’ మూవీకి గంగయ్య నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అన్నట్టు ఈ సినిమా ద్వారానే గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ‘సంకీర్తన’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
పైగా ఇళయరాజాతో గంగయ్యకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అలాగే ఆయన కొన్ని చిరస్మరణీయ చిత్రాలను పంపిణీ కూడా చేశారు. సినీ ప్రముఖులు మరియు యం.గంగయ్య శ్రేయోభిలాషులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓకేతెలుగు.కామ్ తరఫున యం.గంగయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.