Samantha- Naga Chaitanya: ఇది నిజంగా అనూహ్య పరిణామం. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా నవ్వుతూ కనిపించే సమంత అరుదైన వ్యాధి బారినపడతారని ఊహించలేదు. సమంత లైఫ్ స్టైల్ గమనించినప్పటికీ చాలా నిబద్ధతగా ఉంటారు. ఆమె వెజిటేరియన్. ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటారు. దాని కోసం ఇంట్లో స్వయంగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు పండిస్తారు. ఇక ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేస్తారు. ఇంత డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ కలిగిన సమంత అనారోగ్యం బారినపడటం దురదృష్టకరం. నిన్న సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది.

సమంత తాను మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడ్డట్లు తెలియజేశారు. ఈ వ్యాధి గురించి తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కండరాల నొప్పులు, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది,ఒంటిపై దద్దుర్లు వంటి సమస్యలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తాయి. మయోసైటిస్ లో రకాలు ఉన్నాయి. కొన్నిటికి చికిత్స కూడా లేదని సమాచారం. సమంత మాత్రం తాను ఈ వ్యాధిని జయించి తిరిగి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
సమంత పరిస్థితికి అభిమానులు చిత్ర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సమంత ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, కియారా అద్వానీతో పాటు పలువురు టాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్స్ సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

ఈ క్రమంలో సమంత మాజీ భర్త నాగ చైతన్య స్పందిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎంత విడిపోయినా సమంతతో నాగ చైతన్యకు పదేళ్లకు పైగా రిలేషన్ ఉంది. 2010లో విడుదలైన ఏమాయ చేశావే మూవీలో జంటగా నటించిన సమంత-నాగ చైత్యనల ప్రేమ అప్పుడే మొదలైంది. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ళు కాపురం చేశారు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. మరి సమంత ఇంత పెద్ద సమస్యకు గురి కాగా చైతూ ఆమె గురించి స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. మనస్పర్థలు వచ్చినప్పటి నుండి సమంత, చైతూ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో చైతూ పబ్లిక్ గా స్పందించడం కష్టమే.