Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అంటూ తేల్చిపారేశారు. సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. బండ్ల గణేష్ తన ట్వీట్స్ లో …”నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. .అందరూ నాకు ఆత్మీయులే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..
నమస్కారం..” అని కామెంట్ చేశారు.

కుటుంబ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం అన్నారు. అలాగే తనకు ఏ పార్టీతో విబేధాలు లేవు. ఎప్పుడైనా నా మాటలు, చర్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని వినమ్రంగా కోరుకున్నాడు. ఇక బండ్ల గణేష్ నిర్ణయంపై నెటిజెన్స్, పవన్ అభిమానులు భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. బండ్ల గణేష్ స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అలాగే జనసేన అభిమాని. సడెన్ గా ఇలాంటి నిర్ణయం వెనుక రాజకీయ వైరుధ్యాలతో విభేదాలు రాకుండా, వ్యాపారాలపై అధికార పార్టీల దెబ్బ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బండ్ల గణేష్ పొలిటికల్ కెరీర్ పరిశీలిస్తే… కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, రాకపోతే నా నాలుక కోసుకుంటా అని శబధం చేశారు.
బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ అప్పట్లో తెగ హల్చల్ చేసింది. ఓటమి తర్వాత బండ్ల గణేష్ పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడడం, కార్యక్రమాల్లో పాల్గొనడం చేయలేదు. కాగా బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గణేష్ జనసేన సానుభూతిపరుడిగా ఉన్నారు. పవన్ అభిమానులు సైతం బండ్ల గణేష్ జనసేన పార్టీలో అధికారికంగా చేరాలి, పార్టీ కోసం పని చేయాలని కోరుకుంటున్నారు.

ఎన్నికల సమయానికైనా ఆయన బరిలో దిగుతారని జనసేన కార్యకర్తలు ఆశిస్తుండగా బండ్ల గణేష్ ఈ ప్రకటన చేశారు. జనసేన అభిమానులను బండ్ల గణేష్ నిర్ణయం నిరాశపరిచిందని కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. కాగా బండ్ల అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్య నాయకులకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తారు. ఇక బండ్ల గణేష్ కి ఇద్దరు కొడుకులు. ఒకరిని హీరో, మరొకరిని నిర్మాత చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ వెల్లడించారు.