
Samantharuth Prabhu : సమంత షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దాదాపు ఆరేడు నెలలు ఆమె కెమెరా ముందుకు రాలేదు. మాయోసైటిస్ బారినపడిన సమంత ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఆమె సాధారణ జీవితం మొదలుపెట్టారు. షూటింగ్స్ లో తిరిగి పాల్గొంటున్నారు. ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ మొదలైంది. ముంబైలో ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ నార్త్ ఇండియా లో ప్లాన్ చేశారు. అనంతరం సౌత్ ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు.
అలాగే ఖుషి మూవీ షూట్ తిరిగి ప్రారంభం కానున్నట్లు దర్శకుడు శివ నిర్వాణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలి షూటింగ్ పార్ట్ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత మాయోసైటిస్ నుండి పూర్తిగా బయటపడ్డారని అభిమానులు భావించారు. అయితే అది నిజం కాదని, ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
మయోసైటిస్ కి ఇంకా చికిత్స కొనసాగుతుందట. దాని కోసం రోజు ఆమె గంటల తరబడి వ్యాయామం చేస్తున్నారట. 2 నుండి 4 గంటలు జిమ్ లో కష్టపడుతున్నారట. అలాగే యాంటీబాడీస్ కోసం ఐవిఐజి ఇంజక్షన్స్ వేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంత పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత తన అనారోగ్యం గురించి పబ్లిక్ కి తెలియజేశారు. మాయోసైటిస్ సోకిందని సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూనే సమంత యశోద చిత్ర డబ్బింగ్ పూర్తి చేశారు. అప్పటి నుండి సమంత అరుదుగా బయట కనిపిస్తున్నారు. కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా… వాయిదా పడింది.