Samantha Raj Marriage: చాలాకాలంగా ప్రేమలో ఉండి మొత్తానికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడుమోరు, ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు. వీరిద్దరి బంధానికి సంబంధించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి తమ వైవాహిక బంధం ద్వారా వాటన్నింటికీ సమాధానం చెప్పారు సమంత, రాజ్. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారానే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని… ఆ తర్వాత అది పెళ్లికి దారితీసిందని తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరంలోని ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో వీరిద్దరూ సోమవారం తెల్లవారుజామున ఒకటయ్యారు. వాస్తవానికి ప్రస్తుత కాలంలో ముహూర్తాలు లేవు. మూడాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు.. అలాంటప్పుడు వీరిద్దరూ పెళ్లి ఎలా చేసుకున్నారు? పైగా తెల్లవారుజామున ఎలా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు? అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సమంత, రాజ్ వివాహానికి సంబంధించి ఈషా ఫౌండేషన్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
“లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూత శుద్ధి వివాహం రాజ్, సమంత.. సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగ కేంద్రంలో ఉన్న లింగ బైరవీదేవి ఆలయంలో పవిత్రమైన భూత శుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని” ఈషా ఫౌండేషన్ కార్యాలయం ప్రకటించింది.. మనదేశంలో ప్రాంతాలకు తగ్గట్టుగా వివాహ క్రతువులు జరుగుతుంటాయి. ఇందులో భూత శుద్ధి కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి వివాహ ప్రక్రియ అనేది లేదు. యోగ నిపుణులకు మాత్రం భూతశుద్ధి వివాహం గురించి తెలిసి ఉంటుంది.
యోగా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియనే భూత శుద్ధి వివాహం అంటారు. ఈ వివాహాన్ని లింగ బైరవి ఆలయాలలో మాత్రమే చేస్తుంటారు. లేదా ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే నిర్వహిస్తుంటారు..
వధూవరుల దేహాలలోని పంచభూతాలను భూత శుద్ధి విధానం ప్రక్షాళన చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత, ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగించేలా లింగ బైరవి దేవి అనుగ్రహిస్తుందని యోగా నిపుణులు నమ్ముతుంటారు. పైగా ఈ వివాహాన్ని తెల్లవారు జామున మాత్రమే నిర్వహిస్తుంటారు.. ఆడంబరానికి దూరంగా ఈ వివాహ క్రతువు జరుగుతుంది. పైగా దంపతులిద్దరూ లింగ బైరవి దేవికి దీపారాధన చేయాలి. ఆ తర్వాత అనేక క్రతువులను పూర్తి చేయాల్సి ఉంటుంది..
ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో జరుగుతుంటాయి. సమంత రాజ్ వివాహం కూడా అలానే జరిగింది. గతంలో నాగచైతన్యను చేసుకున్నప్పుడు క్రైస్తవ, హిందూ సంప్రదాయాలలో సమంత వివాహం చేసుకుంది.. ఇప్పుడు మాత్రం కేవలం భూత శుద్ధి విధానంలో మాత్రమే వివాహం చేసుకుంది. పంచాంగం ప్రకారం ప్రస్తుతం మూఢాలు వచ్చాయి. ఫిబ్రవరి నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని పండితులు ప్రకటించారు. ఈ మూఢాల్లో పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ ల వివాహం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో..