Samantha, Naga Chaitanya : తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించి సినీ పరిశ్రమతోపాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది సమంత-నాగచైతన్య జంట. ఇప్పుడు విడిపోతున్నామని అనౌన్స్ చేసి రెట్టింపు దిగ్భ్రాంతికి గురిచేసింది ఇదే జంట. యాదృశ్చికంగా వారి మ్యారేజ్ డేకు కొన్ని రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించారు. రేపు వీరి నాలుగో పెళ్లి రోజు. 2017 అక్టోబర్ 7న ఒక్కటయ్యారు వీరిద్దరూ. ఈ పెళ్లి రోజు నేపథ్యంలో మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరికి సంబంధించిన విషయాలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా.. సమంత-చైతూ విడిపోకపోయి ఉంటే ఎలా ఉండేది?

‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట.. అప్పుడే ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా కాలం లవ్ జర్నీ కొనసాగించారు. సుదీర్గ ప్రయాణం తర్వాత 2017లో వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లో ‘సమంత రుత్ ప్రభు’ అని ఉన్న తన పేరును.. ‘సమంత అక్కినేని’ అని మార్చుకుంది. ఆ విధంగా.. అన్ని విధాలుగా అక్కినేని వారి ఆడపడుచుగా మారిపోయింది. ఆల్ హ్యాపీస్. సాఫీగా సాగిపోతున్న సంసార సాగర ప్రయాణంలో టైటానిక్ లాంటి భారీ కుదుపు.
అప్పటి వరకూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య.. విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా తన సోషల్ మీడియా అకౌంట్లో అక్కినేని పేరును తొలగించింది సామ్. దాంతో.. ఇక, ఊహాగానాలకు అడ్డులేకుండాపోయింది. ఏం జరిగింది? ఏం జరగబోతోంది? అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఈ విషయమై రోజుల తరబడి మౌనంగా ఉన్న ఈ జంట.. ఒక్కసారిగా సైలెన్స్ ను బ్రేక్ చేసింది. తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు సామ్-చైతూ.
రేపు ఈ జంట నాలుగో పెళ్లి రోజు. ఈ విభేదాలు రాకపోయి ఉంటే.. విడిపోవడం అన్నదే జరగకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ హాలిడే స్పాట్ లోనో వాలిపోయేవారు. ఈ స్పెషల్ డేను.. మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకునేవారు. అభిమానుల విషాద పోస్టులకు బదులుగా.. గ్రీటింగ్స్ వెల్లువెత్తేవి. హితులు, సన్నిహితుల నుంచి హృదయ పూర్వక శుభాకాంక్షలు అందుకుంటూ ఉండేవారు. కానీ.. నాగార్జున అన్నట్టుగా వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరం. వ్యక్తిగతంగా వారిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకోవడం మినహా.. ఇప్పుడు ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు.