RRR: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ ఆర్ ఆర్”. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి, మెగా ఫ్యామిలిలకు సంబంధించిన ఇద్దరు హీరోలు మొదటి సారిగా కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇందులో భాగంగానే.. ముంబయిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంలేదని మేకర్స్ ప్రకటించడంతో.. ఒక్కసారిగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలోనే వారిని కాస్త సంతోషపెట్టేందుకు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.
ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ భాయ్ మాట్లాడుతున్న ఫొటోలను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఈ కార్యక్రమాన్ని స్టార్ ప్లస్ పెద్దమొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రత్యేక సందర్భంలో ఈవెంట్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.