Roja Responds to Chiranjeevi’s Meeting: ఏపీలోని సినిమా టికెట్ల ధరల తగ్గింపు జగన్ సర్కారుకు కొత్తకొత్త తలనొప్పులను తీసుకొస్తుంది. ప్రభుత్వం నిర్ణయంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొద్దిరోజులుగా గ్యాప్ పెరుగుతూ పోతోంది. ఈక్రమంలోనే ఏపీ సర్కార్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్య వార్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
సినిమా వాళ్లపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతుండటంతో కొద్దిరోజులపాటు మౌనంగా వహించిన సినిమావాళ్లు ఒక్కొక్కరుగా గొంతెత్తుతున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారనే కామెంట్స్ చేయడంతో ఈ వివాదం ముదిరిపాకాన పడింది. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలను చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. మెగాస్టార్ ను నిన్న లంచ్ కు ఆహ్వానించారు. దీంతో ఆయన నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సినిమా సమస్యలపై చర్చించారు. అనంతరం లంచ్ ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి అన్నివిధలా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యకరమైన నిర్ణయం వస్తుందనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.
సీఎం జగన్, చిరంజీవి భేటీపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. ‘సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లే యత్నం చేస్తుంటాయి.. సామాన్యుల దృష్టిలో ఉంచుకొనే ఆయన పాఠశాలలు, కళాశాలల ఫీజులు తగ్గిస్తే యజమాన్యపై కక్ష్య సాధింపు అన్నారని గుర్తు చేశారు. అలాగే సినిమా టికెట్ల విషయంలోనూ ఇలానే అంటున్నారన్నారు. ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారానికి సీఎంతో చిరంజీవి భేటి కావడం శుభపరిణమం అని తెలిపారు. ఇండస్ట్రీలోని సమస్యలు సీఎంకు న్యాయమనిపిస్తే తప్పకుండా మంచి చేస్తారని’ రోజా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.